‘యాత్ర 2’ ఫ‌స్ట్ లుక్ వచ్చేసింది

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగింది. రాబోయే ప్రత్యక్ష ఎన్నికలను దృష్టిపెట్టుకుని పలువురు సినీ ప్రముఖులు పొలిటికల్ థ్రిల్లర్స్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈకోవలోనే రూపొందుతోన్న సినిమా ‘యాత్ర 2‘. 2019లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన ‘యాత్ర‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది ‘యాత్ర 2‘.

మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ‘యాత్ర 2‘లో వై.ఎస్‌.ఆర్ త‌న‌యుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని.. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారట. ‘యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుద‌ల చేశారు. ఇప్పుడు ‘యాత్ర 2‘ని వచ్చే యేడాది ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మొదటి భాగంలో వై.ఎస్.ఆర్ గా తనదైన నటనతో ఆ పాత్రకు వెన్నె తెచ్చారు మలయాళీ మెగాస్టార్ మమ్మట్టి. ఇప్పుడు సీక్వెల్ లోనూ వై.ఎస్.ఆర్. పాత్రలో మమ్ముట్టి కనిపించబోతున్నారు. ఇక.. ‘యాత్ర 2‘లో ప్రధాన పాత్రైన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గా తమిళ నటుడు జీవా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ‘రంగం, స్నేహితుడు‘ వంటి సినిమాలతో జీవా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. లేటెస్ట్ గా ‘యాత్ర 2‘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి, వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్రలో జీవా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

Related Posts