బాలీవుడ్ బాట పడుతోన్న దక్షిణాది భామలు

బాలీవుడ్ అనేది ప్రతీ హీరోయిన్ కి అల్టిమేట్ గోల్. అయితే.. దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వెళ్లిన కొంతమంది తారలు అక్కడే సెటిలైపోతే.. మరికొంతమంది మాత్రం ఒకటి, అరా సినిమాలతో వెనక్కి వచ్చేశారు. హిందీ చిత్రసీమలో గతంలో సత్తా చాటుకున్నవారే కాదు.. ఇప్పటికీ రాణిస్తున్న ఎందరో ముద్దుగుమ్మలకు దక్షిణాది మూలాలున్నాయి.

వైజయంతీమాల, హేమమాలిని, రేఖ, జయప్రద, శ్రీదేవి, ఐశ్వర్య, విద్యాబాలన్, దీపిక వంటి కథానాయికలు.. దక్షిణాది నుంచి బాలీవుడ్ కి వెళ్లి.. అక్కడ అగ్ర నాయికలుగా వెలిగొందారు. అలాగే.. దక్షిణాది నుంచి బాలీవుడ్ లో ప్రవేశించి.. ఒకటి, అరా సినిమాలకే వెనక్కి వచ్చేసిన భామలు కూడా చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో రాధిక, విజయశాంతి, భానుప్రియ, రమ్యకృష్ణ, రంభ, సౌందర్య, త్రిష వంటి నాయికలను చెప్పుకోవచ్చు.

గతేడాది ‘జవాన్‘తో బాలీవుడ్ లోకి బడా ఎంట్రీ ఇచ్చింది నయనతార. ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుక్ కి జోడీగా నటించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్‘ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ‘జవాన్‘ తర్వాత నయనతార మళ్లీ బాలీవుడ్ సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. ఇక.. లేటెస్ట్ గా సౌత్ నుంచి బీటౌన్ బాట పడుతోన్న భామల్లో కీర్తి సురేష్, సాయిపల్లవి, సంయుక్త వంటి వారున్నారు.

ఇప్పటివరకూ సౌత్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టిన కీర్తి సురేష్.. ఇప్పుడు వరుణ్ ధావన్ ‘బేబి జాన్‘తో బాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. తమిళ చిత్రం ‘తేరి‘ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ గ్లామరస్ అవతార్ లో కనువిందు చేయబోతుంది. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా బాలీవుడ్ లో ఒకేసారి రెండు సినిమాలతో బిజీగా ఉంది. వీటిలో ఒకటి.. రణ్ బీర్ కపూర్ తో చేస్తున్న ‘రామాయణ్‘ కాగా.. మరొకటి అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో చేస్తున్న మూవీ.

ఇప్పటివరకూ దక్షిణాదికే పరిమితమైన సంయుక్త మీనన్ బాలీవుడ్ బాట పట్టింది. తెలుగు కుర్రాడు చరణ్ తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్న ‘మహారాగ్ని‘ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది సంయుక్త. ఈ మూవీలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కాజోల్, ప్రభుదేవా ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరోవైపు.. పూజా హెగ్డే, రష్మిక, సమంత వంటి సౌత్ బ్యూటీస్ కూడా ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. అయితే.. వీరిలో సమంత మాత్రం హిందీలో కేవలం వెబ్ సరీస్ లకే పరిమితమయ్యింది. మొత్తంమీద.. సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళుతోన్న భామల సంఖ్య ఈమధ్య జోరందుకుంది.

Related Posts