ప్రముఖ నటుడు కన్నుమూత

ఈ మధ్య సినిమా పరిశ్రమల్లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. రీసెంట్ గానే జైలర్ సినిమాలో కనిపించిన తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు హఠాత్తుగా కన్నుమూశారు. తమిళ్ స్టార్ హీరో అజిత్ కు కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిన వాలి సినిమాతో నటుడుగా పరిచయం అయ్యాడు మారిముత్తు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. 2008లో కన్నుమ్ కన్నుమ్ అనే చిత్రంతో దర్శకుడుగా మారాడు. ఆ సినిమా విజయ సాధించలేదు. దీంతో అటు దర్శకత్వం, నటనకు కొంత గ్యాప్ వచ్చింది.

2011లో మళ్లీ మిస్కిన్ డైరెక్ట్ చేసిన యుద్ధం సెయ్ అనే చిత్రంతో నటన మొదలుపెట్టారు. ఆపై నటనపై ఫోకస్ చేసి నటిస్తూ వెళ్లారు. చూడ్డానికి సీరియస్ గా కనిపిస్తారు కాబట్టి.. ఎక్కువగా ఆ తరహా పాత్రలే వచ్చాయి. విలన్ గా, విలేజ్ పెద్దగా, ఇంటి పెద్ద వంటి పాత్రల్లో అచ్చంగా ఒదిగిపోయి నటించేవారు మారిముత్తు. తెలుగు వారికి కూడా అనేక డబ్బింగ్ సినిమాలతో పరిచయం అయ్యారు. చాలా సినిమాల్లో అతన్ని చూస్తే కోపం వస్తుంది. అంటే అంత బాగా నటించేవారని అర్థం. అలాగే సెంటిమెంట్ ను పండించే పాత్రల్లో బలే ఆకట్టుకుంటారు మారిముత్తు. ప్రస్తుతం భారతీయుడు2 సినిమాలోనూ నటిస్తున్నారు మారిముత్తు.


సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ లో కూడా ప్రధాన పాత్రల్లో నటించారు మారిముత్తు. అలా సన్ టివిలో ప్రసారం అయ్యే ఎథిర్ నీచల్ అనే ఓ సీరియల్ కు డబ్బింగ్ కు చెబుతుండగానే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కు తరలించినా అప్పటికే మరణించారు. మారిముత్తు మాత్రమే చేయగల కొన్ని పాత్రలున్నాయి. అలాంటి ప్రతిభావంతమైన నటడు హఠాత్తుగా కన్నుమూయడం తీరని లోటు అనే చెప్పాలి.

Related Posts