బేబమ్మలు కాదు.. బేబీలే బెటర్

కథ అర్థం అయితే నటనలో డెప్త్ వస్తుంది అంటారు. కనీసం చెబుతున్న డైలాగ్ మీనింగ్ తెలిసినా.. పలికే ఎక్స్ ప్రెషన్ బెటర్ అవుతుంది. ఈ విషయంలో తెలుగులో నటిస్తున్న పరభాషా హీరోయిన్లు ఎప్పుడూ మైనస్ మార్కులే వేయించుకుంటున్నారు. కొంతమందికి తెలుగు తెలిసినా నటన రాదు. ఒకవేళ తెరపై మనకు కొంత వరకూ నటన కనిపించినా ఆ నటన రాబట్టడానికి దర్శకుడు ఎన్ని పాట్లు పడ్డాడో తెలియదు.

ఈ విషయంలో ఉప్పెన సినిమా టైమ్ లో దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ కృతిశెట్టితో ఎంత ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా విజయ్ సేతుపతితో వచ్చే సన్నివేశాన్ని ఏకంగా పన్నెండు రోజులు చిత్రీకరించారట. ఇదంతా నటన మాత్రమే తెలియకపోవడం కాదు.. భాష కూడా తెలియకపోవడం వల్లే. ఇంక ఇతర హీరోయిన్లలో చాలామందికి నటనతో అవసరం ఉండదు కాబట్టి అలా నెట్టుకొస్తున్నారు.

బట్ భాష తెలిసి, కథ అర్థమైతే పాత్రలు ఎంత గొప్పగా పండుతాయి అనేందుకు సరైన ఉదాహరణ బేబీ సినిమాలోని వైష్ణవి చైతన్య. ఈ అమ్మాయిన సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తిడుతున్నారు అంటే అందుకు కారణం తను నటించింది అని ఎవరూ భావించలేదు. అంత సహజంగా పాత్రలో ఒదిగిపోయింది. రెండు మూడు వేరియేషన్స్ పాత్రలో అద్భుతమైన నటన చూపించి శభాష్ అనిపించుకుంది.

ఇదంతా ఎందుకు అంటే ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండేవాళ్లు అందుకే తీసుకోవడం లేదు అనేవాళ్లు మన మేకర్స్. బట్ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎలాంటి పాత్రైనా చేయడానికి వీళ్లూ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది హీరోయిన్లు నిరూపించుకున్నారు.

కాకపోతే వీరికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు. ఇస్తే బేబీలా సినిమాకు నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఎక్స్ ట్రా మైలేజ్ తెస్తారు. అందులో ఏ సందేహం లేదు. అఫ్ కోర్స్ అందరూ అద్భుతమైన నటీమణులే అని చెప్పలేం. బట్ భాష తెలిసిన వాళ్ల నటన తెలియని వారితో పోలిస్తే ఖచ్చితంగా చాలా చాలా బెటర్ గా ఉంటుందనేది మాత్రం నిజం. మరి ఈ నిజం తెలుసుకుని మన మేకర్స్ మన హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇస్తే.. ఇది తెలుగు పరిశ్రమ అనే మాటకు సరైన అర్థం ఉంటుంది.

Related Posts