సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న విజయ్ 69?

తమిళ ఇళయదళపతి విజయ్ త్వరలో పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కాబోతున్నాడు. ఈనేపథ్యంలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోబోతున్నాడనే ప్రచారం ఉంది. ప్రస్తుతం తన 68వ చిత్రంగా ‘గోట్’ చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ తర్వాత విజయ్ 69 కూడా ఉంటుందనే టాక్ కోలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది.

విజయ్ 69 పై అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే.. విజయ్ 69 కోసం ప్రధానంగా హెచ్.వినోద్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. వీరిలో హెచ్.వినోద్ తప్ప అట్లీ, నెల్సన్ ఇద్దరూ.. విజయ్ తో సినిమా చేసిన వారే. అయితే.. వీరిలో హెచ్. వినోద్ కే విజయ్ 69 డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విజయ్ 69 ప్రకటన రాకపోయినా.. అప్పుడే ఆ మూవీలో నటించే నటీమణులు ఎవరనే దానిపైనా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ కథానాయికలుగా నటించనున్నారని వినిపిస్తుంది. ఇప్పటికే సమంత.. విజయ్ తో ‘కత్తి, తేరి, మెర్సల్’ వంటి చిత్రాల్లో నటించింది. కీర్తి సురేష్ కూడా ‘భైరవ, సర్కార్’ సినిమాల్లో విజయ్ తో మెరిసింది. మరి.. విజయ్ 69 పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts