అభిమానులా.. రౌడీలా ..?

రివ్యూ అనేది ఒకడి అభిప్రాయం. అది వ్యక్తిగతం. రాయడం నుంచి చెప్పడం వరకూ.. పూర్తిగా అది ఒకరి అభిప్రాయం. దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇతరులు సినిమాలకు వెళ్లకపోవడం అంటే అది ఆ రివ్యూవర్ కు దక్కే గౌరవమే తప్ప చెడు అయితే కాదు. కానీ ఈ మధ్య అభిప్రాయాలు చెప్పేవారిపై అభిమానుల పేరుతో దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇది స్టార్ హీరోల ఫ్యాన్స్ నుంచే ఎదురవుతుంది. సదరు సినిమా పోయిందని ఫ్యాన్స్ కూ తెలుసు. కానీ ఆ విషయం ఇంకొకరెవరో చెబితే నచ్చదు. పైగా సినిమా పోయిన ఫ్రస్ట్రేషన్ ను ఆ వ్యక్తిపై తీర్చుకోవాలని చూస్తుంటారు. ఇది చాలాకాలంగా జరుగుతున్నదే. అయితే ఎక్కడో ఒక చోట దీనికి ఎండ్ కార్డ్ వేయకపోతే ఈ దాడులు మరో రూపం తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు.


తాజాగా ఆదిపురుష్ మూవీకి సంబంధించి ఓ యువకుడు తన రివ్యూను ఎదురుగా మైక్ లు పెట్టినోళ్లకు చెప్పుకుంటున్నాడు. అలా చెప్పొద్దు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై భౌతిక దాడికి దిగారు. ఇది ఎంత వరకూ కరెక్ట్. ఆ హక్కు వారికి ఎవరు ఇచ్చారు. అతనేమీ సినిమాను బూతులు తిట్టలేదు. వ్యక్తిగత దూషణలు చేయలేదు. ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది అతని హక్కు కూడా. మొదటి రోజు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచినా అభిమానంతో థియేటర్స్ కు వచ్చినవారు బావుంటే బావుందని ఎగిరి గంతులు వేస్తారు. లేదంటే అంతే నీరసంగా బాలేదనీ చెబుతారు. హిట్అన్నప్పుడు ఎత్తుకుని.. ఫట్ అన్నప్పుడు ఎత్తి కుదేస్తాం అంటే ఎలా కుదురుతుంది.

పైగా అభిమానులుగా చెలామణి అయ్యేవారే ఇలా దౌర్జన్యాలకు దాడులుకు దిగితే.. రేపు ఇంకేదైనా పెద్ద విషయం జరిగితే.. దానికి హీరోలు బాధ్యత తీసుకుంటారా..? ఇలా కొట్టినవారే బాధ్యులవుతారా అంటే.. బుర్ర ఉన్న ఎవడైనా సరే.. కొట్టిన వాడినే బాధ్యుడిని చేస్తారు. చట్ట పరంగానూ అతనే శిక్షార్హుడవుతాడు తప్ప.. హీరోలకు పోయేదేం లేదు.


ఇదే విషయంలో మరో వెర్షన్ కూడా ఉంది. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఇలా చేస్తున్నారు అనేది సదరు అభిమానుల ఆరోపణ. యాంటీ ఫ్యాన్స్ అనే మాటను క్రియేట్ చేసుకుందే ఫ్యాన్స్. సోషల్ మీడియాల్లో అత్యంత నీచంగా,జుగుప్సాకరమైన పోస్ట్ లతో తమను తాము దిగజార్చుకుని అదేదో తాము హీరోలకే ఎలివేషన్ ఇస్తున్నంత శునకానందం పొందుతున్నారు తప్ప.. తమ క్యారెక్టర్ ను తామే ఎంత బ్యాడ్ చేసుకుంటున్నారు అనేది రివ్యూ చేసుకోరు.ఏదేమైనా ఆదిపురుష్‌ రివ్యూ సందర్భంగా భౌతిక దాడికి గురైన యువకుడి స్పందన హుందాగా ఉంది. ఆ హుందాతనం అభిమానుల్లో కూడా ఉంటే ఇలా బజారు రౌడీల్లా బరితెగించరు. ఇలాంటి వారికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సరైన గుణపాఠం నేర్పాల్సి ఉంటుంది.

Related Posts