విజయ్ , పరశురామ్ కు కండీషన్స్..?

విజయ్ దేవరకొండ, పరశురామ్ ఇద్దరినీ ఒకేసారి టాప్ లీగ్ లోకి తెచ్చిన సినిమా గీత గోవిందం. అంతకు ముందు పరశురామ్ కొన్ని సినిమాలు చేసినా అవేవీ.. అతన్నీ పెద్ద దర్శకుడు అనే మాటకు దగ్గర చేయలేదు. ఇటు అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నా.. విజయ్ దేవరకొండను అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా మాత్రం నిస్సందేహంగా గీత గోవిందమే.

ఈ సినిమాతోనే రష్మిక మందన్నా కూడా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయింది. అందుకే మరోసారి విజయ్ – పరశురామ్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందర్లోనూ ఆసక్తి పెరిగింది. కాంబినేషన్ క్రేజ్ కూడా ఉంది కాబట్టి.. బిజినెస్ కు కూడా ఢోకా లేదు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ కాంబో సెట్ చేయడం వెనక దిల్ రాజు మాస్టర్ మైండ్ వేరే ఉందట.
విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు.

ఈ టైమ్ లో దిల్ రాజు లాంటి బ్యానర్ లో సినిమా చేస్తే అతనికి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. అటు పరశురామ్ అందరు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని వారి సినిమాలు చేయకుండా అభాసు పాలవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో వీరితో కలిపి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఐడియా వచ్చింది దిల్ రాజుకు. నిర్మాత తలచుకుంటే డేట్స్ కు కొదవా అన్నట్టుగా దిల్ రాజు ప్రపోజల్ కష్టాల్లో ఉన్న విజయ్, పరశురామ్ లకు నచ్చింది.

అంతే పరశురామ్ ప్రాబ్లమ్ క్లియర్ చేసే బాధ్యత దిల్ రాజు తీసుకున్నాడు. దాదాపు క్లియర్ అయినట్టే అని కూడా అంటున్నారు. ఇటు విజయ్ ఇన్ని ఫ్లాపుల మధ్య కూడా దిల్ రాజు ఆఫర్ ఇచ్చాడంటే అనే పాయింట్ హైలెట్ అవుతుంది. మరి ఇదంతా చేస్తే దిల్ రాజుకు ఏమొస్తుంది అనిపిస్తోంది కదా..? ఏమీ రాకుండానే రాజుగారు ఇలా చేస్తారా..?


యస్.. ఈ ఇద్దరికీ ఇప్పుడు ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. తర్వాత కూడా తన బ్యానర్ లో చెరొక సినిమా చేయాలనే కండీషన్ పెట్టారు. ఆ కండీషన్ కు ఒప్పుకున్న తర్వాతే ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయింది. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ – పరశురామ్ చేస్తోన్న సినిమా కాక.. మరో సినిమా ఇద్దరూ ఈ బ్యానర్ లో చేయాలి. అదీ కండీషన్. ఈ కండీషన్ లో భాగంగా ఆల్రెడీ విజయ్ దేవరకొండకు ఓ దర్శకుడిని కూడా సెట్ చేసే పనిలో ఉన్నాడు దిల్ రాజు.


ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనేది దిల్ రాజు ఆలోచన. మంచి కథ సెట్ అయితే విజయ్ కి మాత్రం ఏం ఇబ్బంది ఉంటుంది. సో.. దిల్ రాజు మాస్టర్ మైండ్ తో ఇలా హీరో, దర్శకుడిని ఇన్ డైరెక్ట్ గా కండీషన్స్ తో లాక్ చేసిపెట్టాడన్నమాట.

Related Posts