ఇద్దరు రమేష్ లకు మెగా సపోర్ట్ లభించింది

మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నట దిగ్గజం. మరోవైపు రాజకీయాల్లోనూ ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు తన టెర్మ్ లోనే ఎమ్.పి. గా, కేంద్రమంత్రిగానూ పనిచేసిన క్రెడిట్ చిరంజీవిది.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కొన్నాళ్లు యాక్టివ్ గానే ఉన్నా.. ఆ తర్వాత రాజకీయాలను పక్కన పెట్టేసి సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే.. మళ్లీ చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి ప్రస్తావించారు చిరంజీవి. ఇటీవలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకోసం రూ.5 కోట్లు విరాళం ఇచ్చి పరోక్షంగా జనసేనకు మద్దతు పలికారు చిరంజీవి.

తాజాగా.. బి.జె.పి, టి.డి.పి, జనసేన కూటమి తరపున అనకాపల్లి నియోజకవర్గం ఎమ్.పి. గా పోటీ చేస్తున్న సి.ఎమ్. రమేష్, పెందుర్థి నియోజకవర్గం ఎమ్మేల్యేగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ లకు తన మద్దతు ప్రకటించారు చిరంజీవి. అందుకు సంబంధించిన ఓ వీడియో రిలీజయ్యింది. ఇందులో..

‘నా చిరకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులు. నియోజకవర్గాల అభివృద్ధికి దోహదపడతారు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది‘ అన్నారు చిరంజీవి.

Related Posts