బాలయ్య సినిమాకు ఘోర అవమానం

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే థియేటర్స్ దగ్గర ఎంత హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. ఈ రీ రిలీజ్ లకు కూడా ఫ్యాన్స్ కొత్త సినిమా వచ్చినంత హడావిడీ చేస్తున్నారు. కటౌట్స్, బ్యానర్స్ పెట్టి ఓ రేంజ్ లో హంగామా చేస్తూ.. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్ప అని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో రీసెంట్ గా ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన నరసింహనాయుడు చిత్రాన్ని 4కే లో అప్డేట్ చేసి రీ రిలీజ్ చేశారు. బట్ ఈ నరసింహ నాయుడుని ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిజంగా ఇది బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీయేనా అని ఈ తరానికి డౌట్ వచ్చేంతలా విడుదలైన అన్ని చోట్లా ఉస్సూరుమనిపించారు అభిమానులు.


2001లో వచ్చిన నరసింహ నాయుడు అప్పటి అన్ని రికార్డులను చెరిపేసింది. అన్ని చోట్లా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఎన్నో కేంద్రాల్లో, యాభై, వంద రోజులు ఆడి ఈ విషయంలోనూ సిరకొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓ రకంగా ఇది బాలకృష్ణ నట విశ్వరూపంలా ఉంటుంది. ట్రైన్ ఎపిసోడ్, ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్, ట్రైన్ దగ్గరే జరిగే రెండు ఫైట్స్, పాటలు, డ్యాన్సులు, సెంటిమెంట్, కామెడీ.. ఒకటేమిటీ.. ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ హండ్రెడ్ పర్సెంట్ కుదిరిన సినిమా ఇది. ప్రస్తుతం ఫ్యాక్షన్ సినిమాలు పెద్దగా రావడం లేదు. కాబట్టి ఈ తరానికి ఈ సినిమా కొత్తగానే ఉంటుంది అని భావించారు. బట్ రీ రిలీజ్ లో రికార్డులు కాదు కదా.. కనీసం థియేటర్స్ ఫుల్ కూడా కావడం లేదు అనేది వాస్తవం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్శీస్ లో కూడా ఈ మూవీని విడుదల చేశారు. అక్కడా అదే సీన్ కనిపిస్తోంది. మొత్తంగా రీసెంట్ గానే పవన్ కళ్యాణ్‌ ఖుషీతో, ఎన్టీఆర్ సింహాద్రితో రీ రిలీజ్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించారు. వారితో పోలిస్తే దరిదాపుల్లో కాదు కదా అసలు సోదిలో కూడా లేకుండా పోయింది నరసింహ నాయుడు. మరి ఈ చిత్రాన్ని బాలయ్య ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకోలేదా లేక కావాలనే వదిలేశారా..? అనేది చెప్పలేం కానీ.. ఒకప్పుడు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా రీ రిలీజ్ లో మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేదు అంటే ఖచ్చితంగా అది ఈ చిత్రానికి జరిగిన ఘోరమైన అవమానం అనే అనుకోవాలి.

Related Posts