ఆస్కారా.. అదేంటో మాకు తెలియదు. కానీ మా ‘ఎలిఫెంట్’ కనిపించడం లేదు..?

కొన్ని సంఘటనలు హృదయ విదారకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశంలో వెనకబడిన గిరిజనులు, లేదా అడవి బిడ్డలు అను నిత్యం అంగడి సరుకుగానే ఉంటారు అనేందుకు ఇది మరో ఉదాహరణ. ఓ వైపు ప్రపంచ అత్యుత్తమ సినిమా అవార్డ్ ఆస్కార్ రావడానికి కారణమైన అడవి జంతువు ఏనుగుతో పాటు దాన్ని సాకి, ఆస్కార్ సినిమాకు కథగా మారిన వ్యక్తులకు మాత్రం ఆస్కార్ గురించి అస్సలేం తెలియదు. ఐదేళ్ల పాటు ఆ జంటపై సినిమా తీసేందుకు టైమ్ వెచ్చించానని చెప్పుకుంటోన్న దర్శకురాలు, నిర్మాతలకు ఇప్పుడు వీరితో అవసరం తీరిపోయింది.

అలాగని వాళ్లేం వీరికి సహాయం చెయ్యక్కర్లేదు. కనీసం ఆ వేదికపైన కూడా ఈ జంట గురించి మాట్లాడింది లేదు. సినిమా తర్వాత పట్టించుకున్నుదీ లేదు. ఈ విషాదకరమైన కథ తెలియాలంటే 95 అకాడెమీ అవార్డుల్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ కథకు మూలమైన బొమ్మన్, బెల్లి అనే జంటను గురించి తెలుసుకోవాలి.


ది ఎలిఫెంట్ విష్పరర్స్ మూలం బొమ్మన్, బెల్లి జంట పెంచుకున్న రఘు అనే అనాథ ఏనుగు. తమిళనాడులోని ముదుమలై అటవీ ప్రాంతానికి చెందిన కట్టునాయకన్ అనే తెగకు చెందిన వారు వీరు. వీరికి చాలా చిన్న వయసులోనే అనాథలా ఉన్న ఏనుగు దొరికింది. దానికి రఘు అని పేరు పెట్టుకుని దాని ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మీడియాకు తెలిసింది. అంటే లోకానికి పరిచయం అయింది.

అలాగని ఆ లోకం వీరి జీవితాల్లో ఏ మార్పూ తేలేదు. అడవి, రఘులనే జీవితాలుగా బొమ్మన్, బెల్లి జంట బ్రతికేస్తోంది. వీరి గురించి తెలిసిన దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ వీరి వద్దకు వెళ్లింది. ఏనుగు చిన్నతనంలోనే వీరితో పరిచయం పెంచుకుంది. వారితో పాటు యేడాదిన్న కాలం పాటు జర్నీ చేసింది. ఈ క్రమంలోనే రఘును మచ్చిక చేసుకుని ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కి పూనుకుంది. ఈ డాక్యుమెంటరీలో బొమ్మన్, బెల్లిల పాత్రలు వారితోనే చేయించారు.

చేయించారు అనేకంటే వారి రోజువారీ క్రమాన్నే దర్శకురాలు పిక్చరైజ్ చేసింది. మొత్తం ఐదేళ్ల పాటు సాగిన ఈ తతంగం తర్వాత ఇప్పుడు ఆస్కార్ గెలుచుకున్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ అనే కథగా బయటకు వచ్చింది. అయితే ఆస్కార్ వచ్చిన తర్వాత కొంతమంది మీడియావాళ్లు ఈ జంటను కలిసి వారి ఆనందం గురించి తెలుసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన మీడియాకు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.
ఓ మామూలు గిరిజన తెగకు చెందిన బొమ్మన్, బెల్లిలకు ఈ సినిమా ప్రపంచం తెలియదు.

దాని వ్యాపార సూత్రాలు అర్థం కాలేదు. అప్పుడెప్పుడో తమ రఘుకు కాస్త ఆహారం దొరుకుతుంది అని భావించి వీరికి వీడియోస్ తీసుకోవడానికి అనుమతినిచ్చారు. తీరా అదో షార్ట్ ఫిల్మ్ గా మారి మార్కెట్ లో అంగడి సరుకు అయింది. అది ఆస్కార్ నూ గెలుచుకుంది. కానీ వీరి బ్రతుకుల్లో ఏ మార్పునూ తేలేదు. ఇంక ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రస్తుతం రఘు అనే ఆ ఏనుగు కనిపించడం లేదు. అడవిలో ఎక్కడో తప్పిపోయిందట. దాన్ని వెదుక్కుంటూ బొమ్మన్ కూడా అడవిలోకి వెళ్లాడు. ఆ టైమ్ లోనే వెళ్లిన మీడయాకు.. బొమ్మన్ భార్య బెల్లి ఈ విషయం చెప్పింది.

అంతే కాదు.. తమకు ఆస్కార్ అంటే ఏంటో అస్సలు తెలియదు అని కూడా చెప్పింది. ప్రస్తుతం మా రఘు మాకు దొరికితే చాలు అదే పదివేలు అనేలా ఆమె రియాక్షన్ కనిపించిందిట. అదీ.. తన షార్ట్ ఫిల్మ్ తర్వాత దర్శకురాలు ఆ జంటతో పాటు రఘును వదిలేసింది. కానీ రఘును వదిలేయడానికి ఆ జంట ఆమెలా ‘నటులు’ కాదు కదా..? అందుకే పాపం ఇప్పుడు బొమ్మన్ అడవిలో గాలింపు మొదలుపెట్టాడు. ఇలాంటివి చూసినప్పుడు ఆనంద పడాలో, బాధపడాలో అర్థం కాదు అనిపిస్తుంది. అదే టైమ్ లో అడవి బిడ్డలను మోసం చేయడంలో బాగా చదువుకున్న, నాగరికులుగా చెప్పుకుంటోన్నవారు కూడా అస్సలు తక్కువేం కాదు అనిపిస్తుంది..

Related Posts