ఇలాంటి డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తే ఆ రేంజే మారుతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రపంచానికి చూపించింది ఆర్ఆర్ఆర్ మూవీ. అతను నటిస్తున్నప్పుడు పాత్రను బట్టి, సన్నివేశాన్ని బట్టి.. శరీరంలోని ప్రతి కణం పర్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. కాకపోతే మాస్ హీరో అనే ముద్రలో పడి తనలోని సిసలైన నటుడిని చూపించే పాత్రకు ప్రతీసారి ఓకే చెప్పలేకపోతున్నాడు. రాఖీ సినిమాలోని జైల్, కోర్ట్ సీన్ తో పాటు టెంపర్ సినిమాలోని కోర్ట్ సీన్స్ లో అతని నటన తరాల వరకూ చెప్పుకుంటుంది.

ఈ విషయాన్ని తోటి స్టార్ హీరోలు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు. ఏ నటుడ్నీ ఓ పట్టాన మెచ్చుకోని కృష్ణవంశీ లాంటి వారు కూడా ఎన్టీఆర్ ను ది బెస్ట్ యాక్టర్ అని చెబుతాడు. ఇక అతని అదనపు బలం డిక్షన్. చెప్ప డైలాగ్ పై పూర్తి పట్టుతో కనిపిస్తాడు. ఇది తన తరంలో మరే హీరోకూ లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి ఎన్టీఆర్ కూడా తను ఓ దర్శకుడితో పనిచేయాలనే కోరికను ప్రతిసారీ చెబుతాడు. ఆ దర్శకుడే వెట్రిమారన్. తమిళ్ లో టాప్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు వెట్రిమారన్.

అతని కథలు నేల విడిచి సాము చేయవు. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. తను వచ్చిన సమూహాలను ప్రతిబింబిస్తూనే.. కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి అద్భుతమైన కథనంతో కథలు చెబుతాడు. దర్శకుడుగానే కాక నిర్మాతగా కూడా తన అభిరుచిక తగ్గ సినిమాలు చేస్తుంటాడు వెట్రిమారన్. అతని ఖాతాలో రెండు నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఇతని డైరెక్షన్ లోని సినిమాలతోనే హీరో ధనుష్ కు రెండుసార్లు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ రావడం మరో విశేషం. ఖచ్చితంగా చెప్పాలంటే అద్భుతమైన కథలు చెప్పగల సత్తా ఉన్న టాప్ ఫైవ్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్ లో వెట్రిమారన్ ఖచ్చితంగా ఉంటాడు. అందుకే ఎన్టీఆర్ అతనితో సినిమా చేయాలని ఉందని చెప్పాడు. ఇప్పటి వరకూ అతను వేరే ఏ దర్శకుడి గురించీ ఇలా చెప్పలేదు. అదీ వెట్రిమారన్ ప్రతిభ.


ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ – ధనుష్ కాంబినేషన్ లో వెట్రిమారన్ ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు అనే రూమర్ వచ్చింది. కానీ అది నిజం కాదు. అయితే ప్రస్తుతం వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన విడుదలై అనే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పటి వరకూ కమెడియన్ గా ఉన్న పరోటా సూరి హీరోగా నటించిన సినిమా ఇది. బట్ ట్రైలర్ చూస్తే మరోసారి ఓ అద్భుతమైన కథతో వస్తున్నాడు వెట్రిమారన్ అని అర్థం అవుతుంది. తమిళనాడులోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది.

విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేశాడు. గౌతమ్ మీనన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. తమిళ్ దేశియ గ్రూప్ ను లీడ్ చేస్తూ అన్యాయాలను ఎదురించే నాయకుడుగా విజయ్ సేతుపతి తనకంటూ ఓ ముఠాను తయారు చేసుకుంటాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ లు ఆ అటవీ ప్రాంతంలోని మహిళలపై అఘాయిత్యాలు చేస్తుంటారు. ఈ క్రమంలో సూరి పాత్ర తీసుకున్న నిర్ణయం ఏంటనేది ఈ మొదటి భాగంలో చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఇలాంటి కథలు ఒక్క వెట్రిమారన్ మాత్రమే తీయగలడు అనే టాక్ సౌత్ మొత్తం ఉంది. మళయాలం వాళ్లు కూడా అతను చెప్పినంత ఇంటెన్సిటీతో కమర్షియల్ వాల్యూస్ ను యాడ్ చేస్తూ కథలు చెప్పలేరు అంటారు. ఏదేమైనా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి ఓ రా కంటెంట్ ఉన్న కథతో ఎన్టీఆర్ – వెట్రిమారన్ కాంబినేషన్ లో సినిమా వస్తే అవార్డుల మోత మోగడం ఖాయం. అలాగే ఎన్టీఆర్ లోని సిసలైన నటుడుని కూడా మనం చూడొచ్చు. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఎఫ్పుడు వస్తుందో చూడాలి.

Related Posts