ఆంధ్రా అమ్మాయితో అర్జున్ కళ్యాణం అయ్యేనా..?

మాస్ కా దాస్ అనిపించుకుని కొన్ని రోజులు కూడా కాకుండానే సైలెంట్ కావాల్సిన సిట్యుయేషన్ తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ప్రతిభావంతమైన నటుడుగా పేరున్నా.. ఆ మధ్య చేసిన ‘పాగల్’ గా చేసిన హడావిడీ మనోడిని కాస్త ఇబ్బంది పెట్టిందనేది నిజం. దీంతో కొంత తగ్గినట్టు కనిపిస్తున్నాడు. ఆ తగ్గడం వేదికల మీదే కాదు.. వెండితెర మీద కూడా అనిపించేలా ఇప్పుడు అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో వస్తున్నాడు. ఈ నెల 22న విడుదల కావాల్సిన ఈచిత్రాన్ని మే 6కు పోస్ట్ పోన్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.


విశ్వక్ సేన్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరి దృష్టినీ ఆకర్షించింది. తర్వాత వచ్చిన టీజర్, పాటలు మంచి ఇంప్రెషన్ వేశాయి. విశ్వక్ కు మరో విజయం గ్యారెంటీ అనే లుక్ మాత్రం ఆల్రెడీ వచ్చిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు రిలీజ్ లకు సంబంధించి చిన్న సినిమాలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది కాబట్టి.. ఈ మూవీ విజయం టైమింగ్ పై ఆధార పడి ఉంటుంది. అందుకే మే6కు వెళ్లారు. ఇక ట్రైలర్ చూస్తే ఇది రెండు రాష్ట్రాల మధ్య కథలా కనిపిస్తోంది.


తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన అర్జున్ అనే కుర్రాడికి 30యేళ్లు వచ్చినా సరైన సంబంధం కుదరదు. చివరికి ఆంధ్రలో ఓ పెళ్లి సంబంధానికి వెళతారు. అమ్మాయి అతనికి నచ్చుతుంది. ఆమెకూ ఇతను ఓకే. కానీ అంతలోనే దేవుడు రాసిన స్క్రిప్ట్ వల్ల సంబంధం చెడిపోతుంది. అమ్మాయి కూడా తనకీ పెళ్లి ఇష్టం లేదని చెబుతుంది. అందుకు కారణమేంటనేది సినిమాలోనే చూపిస్తారు కానీ.. ట్రైలర్ మాత్రం బావుందనే చెప్పాలి. విశ్వక్, రుక్సర్ జంట కూడా ఫ్రెష్ గా కనిపిస్తోంది. నటన పరంగా ఇద్దరూ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి.. వీరి కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనుకోవచ్చు.ఇక ఇంతకు ముందు రాజావారు రాణివారు సినిమాతో ఆకట్టుకున్న విద్యా సాగర్ చింతా ఈ చిత్రానికి దర్శకుడు. బాపినీడు నిర్మాత. మరి మే 6న వస్తోన్న ఈ అర్జున కళ్యాణం బాక్సాఫీస్ వద్దా మంచి విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts