ముగిసిన‌ వ‌ర్మ‌, పేర్ని భేటీ..ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన వ‌ర్మ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. పెంచాల‌ని సినీ ప్ర‌ముఖుల‌కు విజ్ఞ‌ప్తి చేయ‌డం వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. అయితే.. ఈ అంశం గురించి వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఏపీ మంత్రి పేర్ని నానికి ప్ర‌శ్న‌లు సంధించ‌డం.. దానికి పేర్ని నాని స‌మాధానం చెప్ప‌డం తెలిసిందే. అయితే.. ఈ రోజు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఇది ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో వ‌ర్మ ఏం చెప్ప‌నున్నారు..? పేర్ని నాని ఎలా స్పందిస్తారు..? అని సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది.

అయితే.. ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ ముగిసిన త‌ర్వాత వ‌ర్మ మాట్లాడుతూ.. ఐదు ముఖ్య‌మైన అంశాల గురించి చ‌ర్చించాను. ప్ర‌ధానంగా టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డం గురించి ప్ర‌స్తావించాను. అలాగే థియేటర్ల మూసివేత గురించి ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌న్నారు. ధ‌ర‌ల కేటాయింపు పై ఎవ‌రికీ అధికారం ఉండ‌కూడ‌దు అని చెప్పాను. సినిమా రంగంలో నాకున్న 30 ఏళ్ల అనుభ‌వంతో ఎక్క‌డ ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చాను.

టిక్కెట్ల రేట్ల త‌గ్గిస్తే ఇండ‌స్ట్రీకి బాగా న‌ష్ఠం వ‌స్తుంద‌ని వివరించాను. నా వాద‌న‌ను వినిపించేందుకు మాత్ర‌మే ఇక్క‌డ‌కు వ‌చ్చాను. నేను ఎలాంటి డిమాండ్లు ఆయ‌న ఎదుట పెట్ట‌లేదు. ఈ భేటీ ద్వారా వ‌చ్చిన అభిప్రాయాల పై ఇద్ద‌రం చ‌ర్చిస్తాం. తుది నిర్ణ‌యం ప్ర‌భుత్వ‌మే తీసుకుంటుది. రాజ‌కీయ కక్ష సాధింపు వ‌ల‌న టిక్కెట్ల రేట్లు త‌గ్గించార‌ని అనుకోవ‌డం లేదు. కేవ‌లం బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను టార్గెట్ చేయ‌డం కోసం ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని నేను అనుకోవ‌డం లేదు. స‌మ‌స్య ప‌రిష్కారం అనేది ఇండ‌స్ట్రీ, ప్ర‌భుత్వం ఇద్ద‌రి పైనా ఉంది. తాజా చ‌ర్చ‌ల‌తో నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నాను అన్నారు.