రేపటి సినిమాల్లో ఒక్కటీ సందడి లేదే..?

ఫ్రైడే వచ్చిందంటే మూవీ లవర్స్ కు పండగే. కానీ కొన్నాళ్లుగా ఫ్రైడే ఎవరికీ పెద్దగా గుర్తు కూడా ఉండటం లేదు. ఆ స్థాయిలో నిరుత్సాహ పరుస్తున్నాయి తెలుగు సినిమాలు. రీసెంట్ గా వచ్చిన అఖండ లాంటి చిత్రం ఇప్పటి వరకూ రాలేదనే చెప్పాలి. అఖండతో బాక్సాఫీస్ కు ఓ రేంజ్ లో ఊపు వచ్చినా.. దాన్ని కొనసాగించే సినిమాలు మాత్రం కనిపించడం లేదు. కనిపించాలి అంటే పుష్ప వచ్చే వరకూ ఆగాలి. ట్రైలర్ చూశాక పుష్పపైనా అంచనాలు తగ్గాయనేది వాస్తవం.
ఇక పెద్ద హీరోల మధ్య వచ్చే గ్యాప్ లో చిన్న సినిమాలు రావడం ఎప్పటి నుంచో కామన్. ఒక్కోసారి చిన్న సినిమాలే పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. బట్ ఈ మధ్య అలాంటిదేం కనిపించడం లేదు. ఇక రేపు కూడా చాలా సినిమాలే విడుదలవుతోన్నా.. ప్రధానంగా మూడు సినిమాలు మాత్రమే కాస్త్ ఎక్కువమందికి తెలిసినవి ఉన్నాయి. అందులో శ్రియ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గమనం ఒకటి. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి సుజనా రావు దర్శకురాలు. ఓ మూడు నాలుగు కథల సమాహారంతో ఆంథాలజీలా వస్తున్నట్టు కనిపించింది. కానీ ఇలాంటి కథలు ఇప్పుడు ఆడియన్సెస్ భరించగలరా అనేది పెద్ద డౌట్. దీనికి తోడు సినిమాపై ఏ మాత్రం బజ్ లేదు. ప్రమోషన్స్ చాలా వీక్ గా కనిపించాయి.
దీంతో పాటు కొన్నాళ్లుగా ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తోన్న నాగశౌర్య మూవీ లక్ష్య కూడా ఉంటుంది. ఆర్చరీ గేమ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ కూడా ఆడియన్సెస్ అటెన్షన్ ను డ్రా చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు ఓ కీలక పాత్ర చేశాడు. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి అనే దర్శకుడు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ కూడా మరీ అంత ఇంప్రెసివ్ గా అయితే లేదు.
అలాగే దేశంలోనే మొదటి మడ్ రేస్ సినిమా అంటూ మడ్డీ అనే చిత్రం వస్తోంది. ట్రైలర్ చూస్తే హాలీవుడ్ నుంచి ఇన్సైర్ అయిన చిత్రంలా కనిపిస్తోంది. బురద నేలల్లో వాహనాలతో పోటీలు పెట్టుకునే కొందరు వ్యక్తుల కథ ఇది. ఇలాంటి రేస్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఒక వర్గం ప్రేక్షకులనే ఆకట్టుకుంటాయి. అయితే అందరూ కొత్తవాళ్లే నటించడంతో పాటు ప్రమోషన్స్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదీ చిత్రం. బట్.. రేసీ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా టార్గెటెడ్ ఆడియన్సెస్ కు బాగా రీచ్ అవుతుంది.
ఏదేమైనా ప్రతి వారం నాలుగైదు చిన్న సినిమాలు విడుదలవుతున్నా వాటి ఇంపాక్ట్ మాత్రం కనిపించడం లేదు. అంటే లోపం మేకర్స్ దా ప్రేక్షకులదా అనేది ప్రశ్న అవుతుంది. నిజంగా మేకర్స్ మంచి కథ, కథనంతో రావడం ఓ ఎత్తైతే ఆ విషయం రిలీజ్ కు ముందే ప్రేక్షకులను తెలిసేలా ప్రమోషన్స్ చేసుకోవడం కూడా ఓ ఎత్తు. ఈ ఎత్తులు ఎక్కలేకే కొన్ని మంచి సినిమాలు కూడా మిస్ అవుతున్నాయనే విమర్శ ఎప్పట్నుంచో ఉందే. మరి ఈ రేపు వచ్చే చిత్రాల్లో తోపు ఎవరో చూడాలి.

Related Posts