మరో దేశభక్తి సినిమా వస్తోంది.. ఈ సారి రానా

సినిమా పరిశ్రమలో భక్తి చిత్రాలకు ఎంత ఆదరణ ఉంటుందో దేశభక్తి చిత్రాలకూ అంతే ఆదరణ ఉంటుంది. ఎటొచ్చీ దేశభక్తి చిత్రాల్లో ఎంత వాస్తవికత ఉంటుందనేది ఇంపార్టెంట్. కరోనాకు ముందు బాలీవుడ్ లో ఈ తరహా చిత్రాలు ఓ రేంజ్ లో వచ్చాయి. ఫస్ట్ వేవ్ తర్వాత కూడా కొన్ని సినిమాలు సందడి చేశాయి. ముఖ్యంగా మన దేశంలో జరిగిన అనేక యుద్ధాల కాలం నాటి కథలను వెండితెరపై చెప్పే ప్రయత్నం చేశారు బాలీవుడ్ మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలోనే రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ రాబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్, అలియాభట్, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కాబోతోంది. ఇక ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలోనే తెలుగు నుంచి మరో సినిమా రాబోతోంది.
బాహుబలి కంటే ముందే బాలీవుడ్ లో రిజిస్టర్ అయిన రానా తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకోవడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యాడు. ఘాజీ వంటి చిత్రంతో మెప్పించినా స్టార్డమ్ పరంగా రేంజ్ మారలేదు. అలాంటి రానా హీరోగా ఇప్పుడు మరో దేశభక్తి చిత్రం వస్తోంది. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన కథ. అందుకే టైటిల్ కూడా అదే పెట్టారు. ‘1945’అనేది ఆ టైటిల్. రానా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో అతను సుభాష్ చంద్రబోస్ అనుచురుడుగా, ఐఎన్ఏ సైనికుడుగా కనిపిస్తాడట. రెజీనా కసాండ్రా ఫీమేల్ లీడ్ చేసింది. అయితే తన పాత్ర ఏంటీ ఎలా ఉంటుందనేది ఇంకా చెప్పలేదు. సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యశివ దర్శకుడు.
విశేషం ఏంటంటే.. ఈ మూవీ రానా అరణ్య టైమ్ లోనే అనౌన్స్ అయింది. కానీ ఎందుకో మధ్యలో ఎప్పుడూ సందడి చేయలేదు. ఇన్నాళ్ల తర్వాత సడెన్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నారట. మరి ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది.. పైగా ఇది దేశభక్తి చిత్రం. కాబట్టి ఈ చిత్రాన్ని ఆ రేంజ్ లోనే విడుదల చేస్తారా లేక తెలుగులో మాత్రమే వదులుతారా అనేది చూడాలి.

Related Posts