ఎన్.శంకర్ మెగా హిస్టారికల్ వెబ్ సిరీస్ లు..

ఎన్ కౌంటర్‘ చిత్రంతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న ఎన్.శంకర్.. ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. కొన్నేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న శంకర్ ఇప్పుడు ఒకేసారి మూడు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తున్నారు. ఆ మూడూ కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతుండడం విశేషం. ‘ఎన్‌.శంక‌ర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో’ బ్యాన‌ర్‌ లో శంకర్ ఈ వెబ్ సిరీస్ లకు నిర్మాతగానూ.. దర్శకత్వ పర్యవేక్షకుడిగానూ వ్యవహరించనున్నారు.

తెలంగాణ సాయిధ పోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు తన మొదటి వెబ్ సిరీస్ ను రూపొందించే పనిలో ఉన్నారు. తెలంగాణ సాయిధ పోరాటంలో ప్ర‌జ‌లే సైనికులుగా
యుద్ధం చేయాల్సి వచ్చిన ప‌రిస్థితులు, భూస్వామ్య వ్య‌వ‌స్థ లో సామాన్యుల మీద జరిగిన దాడులు.. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మహిళల ప్రతిఘటన వంటివి ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారట. అక్టోబ‌ర్ నుంచి ఈ సిరీస్ షూటింగ్ మొదలవుతుంది.

మ‌హాత్మ జ్యోతీరావు పూలే స్ఫూర్తితో తన రెండో వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టబోతున్నారు ఎన్. శంకర్.
మ‌హాత్మ జ్యోతీరావు పూలే అనుభ‌వాలు, ఆయ‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు.. పేదలకు, మ‌హిళ‌లకు విద్యను భోదించటం కోసం ఆయన ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొన్నారు. త్యాగాలు చేశారు వంటివి మహాత్మ జ్యోతీరావు పూలే వెబ్ సిరీస్ లో చూపించనున్నారట.

ఇక.. ఎన్.శంకర్ నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందే మూడో వెబ్ సిరీస్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ కథ. అంబేద్కర్.. ఈ దేశానికి ‌, అట్ట‌డుగు ప్ర‌జ‌ల‌కు, అణ‌గారిన వ‌ర్గాల‌కు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని , ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంలో అనుభ‌వించిన బాధ‌ల‌ను, ఆయన ఒక వ్య‌క్తి నుండి వ్య‌వ‌స్థ‌గా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణలు ఇతి వృత్తంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుందట. మొత్తంమీద.. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ మూడు వెబ్ సిరీస్ లు తీసుకురాబోతున్నారు ఎన్.శంకర్.

Related Posts