మహాశివరాత్రి కానుకగా సినిమాల జాతర

ప్రతీ వారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈవారం మార్చి 8న మహాశివరాత్రి కలిసి రావడంతో థియేటర్లలో సినిమాలకు పండగ వాతావరణం నెలకొనబోతుంది. మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో మూడు చిత్రాలు అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఓ క్రేజీ మూవీ స్ట్రీమింగ్ అవ్వబోతుందనే న్యూస్ సినీ లవర్స్ ను తెన ఎగ్జైట్ చేస్తోంది.

ఈవారం వస్తోన్న చిత్రాలలో ముందుగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ ‘భీమా’. మాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వం వహించాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ ఈ మూవీలో హీరోయిన్స్. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ‘భీమా’ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. గోపీచంద్ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సరైన హిట్ ‘భీమా’తో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ మహాశివరాత్రి కానుకగా మార్చి 8న యాక్షన్ తో పాటు డివోషనల్ టచ్ తో ‘భీమా’ అలరించడానికి ముస్తాబవుతోంది.

‘భీమా’తో పాటు మరో మూవీ ‘గామి’ కూడా మహాశివరాత్రి కానుకగా వస్తోంది. పాత్రల ఎంపికలో ఎంతో విభిన్నంగా దూసుకెళ్లోన్న విశ్వక్ సేన్ నటించిన చిత్రమిది. ఇప్పటివరకూ ఎక్కువగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ లో నటించిన విశ్వక్ సేన్.. ‘గామి‘ సినిమాలో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. చాందిని చౌదరి, ఎమ్.జి.అభినయ ఇతర కీలక పాత్రలు పోషించారు. విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాని కార్తీక్ శబరీష్ నిర్మిస్తుండగా.. యు.వి.క్రియేషన్స్ సమర్పిస్తోంది.

‘భీమా, గామి’ చిత్రాలతో పాటు మలయాళం నుంచి ‘ప్రేమలు’ చిత్రం కూడా మహాశివరాత్రి కానుకగా అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘ప్రేమలు’ సినిమా అదే టైటిల్ తో మార్చి 8న తెలుగులో విడుదలవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ‘ప్రేమలు’ తెలుగు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది.

మహాశివరాత్రి కానుకగా థియేటర్లలో మూడు కొత్త సినిమాలు విడుదలవుతుంటే.. ఓటీటీలోనూ క్రేజీ మూవీ ‘హనుమాన్’ స్ట్రీమింగ్ కి రెడీ అవ్వబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంక్రాంతి బరిలో వచ్చిన ‘హనుమాన్’ విడుదలై అప్పుడే 50 రోజులు పూర్తైంది. అసలు ఈపాటికే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సి ఉంది. థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగడంతో ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. లేటెస్ట్ గా ‘హనుమాన్’ సినిమా మార్చి 8 నుంచి జీ5 వేదికగా స్ట్రీమ్ అవ్వబోతుందనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట.

Related Posts