ఎదురు నిలిచినా.. ఎవరికీ ఎనిమీ కాని ఒకే ఒక్కడు

సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ స్థాయి ఉన్నత మైన వ్యక్తిత్వం ఆయనది. సినిమా హీరోగా ఉన్నా.. ఇతర హీరోల్లా ఎప్పుడూ భేషజాలు చూపించలేదు. తానో వీరుడు, శూరుడు అన్న తరహాలో ఎప్పుడూ ఎవరితోనూ ప్రవర్తించలేదు. తనను తాను సినిమా నటుడుగా కంటే ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే చూసుకున్నాడు. అందుకే ఆయన హీరో కృష్ణగానే అభిమానులను సంపాదించుకున్నారు. ఆ కాలంలో ఉన్నట్టుగా సినిమా నటుడు అనగానే దేవుడు రేంజ్ లో ఊహించేసుకుని జనం మధ్యా అలాగే “నటిస్తూ” ఎప్పుడూ కనిపించలేదు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కాంతారావు వంటి హేమాహేమీలున్న టైమ్ లోనే ఎంటర్ అయినా.. అరంగేట్రంతోనే హ్యాట్రిక్ విజయాలు అందుకుని ఆ తర్వాత తనదైన త్రోవలోనే సాగిపోయారు. ఎన్టీఆర్ దేవుడు పాత్రలతో, ఏఎన్నార్ భక్తుడు పాత్రలతో పాటు సాంఘిక చిత్రాలు చేస్తూ సాగిపోతోన్న టైమ్ లో కృష్ణ.. అందుకు భిన్నమైన కథలు ఎంచుకున్నాడు. ఆ ఇద్దరూ విరహ, భగ్న, కుటుంబ కథా చిత్రాలు చేస్తోంటే.. తను మాత్రం మాస్ ను అలరించేలా.. మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే కథలు సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆ క్లాస్ లలోనే కృష్ణకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.


యేడాది పొడవునా మూడు షిఫ్ట్ లలో పని చేయడం ద్వారా పరోక్షగా వేలాది మందికి ఉపాధి దొరికేలా చూశాడు. దాదాపు 30యేళ్ల పాటు అస్సలు రిలాక్స్ కూడా కాలేదు కృష్ణ. అయితే తను నమ్మిన దాని విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అల్లూరి సీతారామరాజును ఎన్టీఆర్ చేయాలనుకుంటే వదిలేస్తానని.. కాదూ టైమ్ పడుతుందంటే ఇప్పుడే చేస్తానని చెప్పి మరీ చేశాడు. మొదట కోపం వ్యక్తం చేసిన ఎన్టీఆర్.. చాలాకాలం తర్వాత ఆ సినిమా చూసి మెచ్చుకున్నారు. అంటే అప్పటి వరకూ కృష్ణపై కోపంగానే ఉన్నారాయన. బాల సుబ్రహ్మణ్యం విషయంలోనూ అంతే. విభేదం రాగానే చెన్నైలో చదువుకుంటోన్న రాజ్ సీతారామ్ అనే కుర్రాడిని తెచ్చి అప్పటి వరకూ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో చేస్తోన్న సింహాసనం సినిమాలో పాటలు పాడించాడు. బాలు లేకపోతే ఎలా అన్న ఊహ కూడా ఆయన చేయలేదు.
ఇక కృష్ణ చేసిన మరో సాహసం.. దేవదాసును మళ్లీ చేయడం. రీమేక్ రైట్స్ విషయంలో చిన్న గ్యాప్ రావడం వల్ల రైట్స్ తీసుకోకుండానే నవలను సినిమా చేశారు. బట్ ఆయనపై కోపంతో ఏఎన్నార్ దేవదాసును కూడా అదే రోజు విడుదల చేశారు. దీనివల్ల కృష్ణ దేవదాసు బావున్నా.. ఎక్కువమంది ఆ చిత్రాన్నే చూశారు. ఈ విషయంలో అక్కినేనికి కోపం వచ్చినా సూపర్ స్టార్ పట్టించుకోలేదు. బట్ ఆ తర్వాత చాలామంది పెద్ద టెక్నీషియన్స్ ఏఎన్నార్ కు చెప్పారు. కృష్ణ దేవదాసు బావుంది అని. అప్పటికి ఆయన శాంతించారు.
ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిశ్రమ అంతా ఆయన వెనక వెళుతుంటే.. అప్పటికే తను నమ్మిన కాంగ్రెస్ ను ఈయన వీడలేదు. పైగా పార్టీ వ్యక్తిగానే కాక.. సినిమా మనిషిగానూ కాంగ్రెస్ కోసం ఎన్టీఆర్ ప్రభుత్వ అవినీతిని దునుమాడుతూ.. మండలాధీశుడు అనే సినిమా నిర్మించడమే కాదు.. తనే ప్రధాన పాత్రలో నటించాడు. ఇది ఎన్టీఆర్ కూడా ఊహించలేదు. కానీ తను పదవి నుంచి దిగిన తర్వాత కానీ అర్థం కాలేదు. అందుకే కృష్ణ ను ఒక్క మాటా అనలేకపోయారు. ఇలా ఏ అంశంలో అయినా సరే.. కృష్ణ ఒక నిర్ణయం తీసుకుంటే ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎదురువెళ్లి మరీ అనుకున్నది సాధించాడు. అదే టైమ్ లో కొందరిని మెప్పించినా.. తను ఎవరికీ శతృవు కాలేదు. తనెవరినీ శతృవుగా చూడలేదు. ఈ నైజమే ఆయన్ని రియల్ సూపర్ స్టార్ ను చేసింది. హీరోగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని శక్తిగా నిలిపింది.

Related Posts