ఎఫ్3 మూవీ రివ్యూ …

రివ్యూ : ఎఫ్3
తారాగణం : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునిల్, రాజేంద్ర ప్రసాద్, అలీ, సోనాల్ చౌహాన్
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : అనిల్ రావిపూడి

ఎఫ్2.. కామెడీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమా. ఆ సినిమా వచ్చిన టైమ్ లో కొన్ని పెద్ద చిత్రాలే వచ్చినా.. అవన్నీ డిజాస్టర్ అనిపించుకోవడంలో అబౌ యావరేజ్ గా నిలవాల్సిన ఎఫ్2 సూపర్ హిట్ అయింది. నిజానికి ఈ చిత్రం సెకండ్ హాఫ్ చాలా వీక్(అది అనిల్ అన్ని సినిమాల్లోనూ కనిపిస్తుంది). అయినా సినిమా హిట్టు కాబట్టి దాని ఫ్రాంచైజీలో ఇప్పుడు ఎఫ్3 అంటూ వచ్చారు. కొందరు కొత్తగా వచ్చారు తప్ప.. తారగణం అంతా పాతవారే. అందుకే దీనికి సీక్వెల్ అనే కలరింగ్ వచ్చింది. రిలీజ్ కు ముందు విపరీతమైన ప్రమోషన్స్ చేశారు. చాలా డైలాగులూ కొట్టారు. మరి ఇవాళ విడుదలైన ఈ మూవీ ఎలా ఉందనేది చూద్దాం.

కథ(..????) :
వెంకీ(వెంకటేష్) తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలను కంటాడు. అన్ని రకాలకూ ఏజెంట్ గా పనిచేసే వారి బాధ్యతంతా వెంకీనే చూసుకుంటుంటాడు. వరుణ్(వరుణ్ తేజ్) తన మామ( సునిల్)తో కలిసి పగటి కలలు కంటూ డబ్బు సంపాదించేందుకు నానా తంటాలు పడుతుంటాడు. వీరికి తోడు బజ్జీలు, పునుగుల వ్యాపారం చేసుకునే తమన్నా, మెహ్రీన్ వారి ఫ్యామిలీ. ఒక పెద్ద ఇంట్లో పని మనిషిగా చేసే హనీని చూసి తనూ రిచ్ అనుకుని ఆమెను ప్రేమించేందుకు తనూ రిచ్ అన్న బిల్డప్ ఇస్తాడు. అటు వెంకీ వద్ద లక్షలు అప్పు చేసిన దగా ఫ్యామిలీ అది వసూలు చేసేందుకు వెళ్లినప్పుడల్లా దబాయిస్తుంటారు. సన్సియర్ గా పనిచేసే పోలీస్ ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్) దాన్ని దాటి అక్రమాలు చేయడానికి ఈ మొత్తం టీమ్ హెల్ప్ తీసుకుంటాడు. తన నిజాయితీతో తెచ్చిన డబ్బులను కమీషనర్ లాగేసుకుంటే అతని ఇంట్లోకే వెళ్లి ఆ డబ్బు దోచుకుని వస్తూ ఓ చోట దాస్తారు. అది వేరెవరో ఎత్తుకుని పోతారు. చివరికి వీరంతా చిన్నప్పుడే తప్పిపోయిన ఓ తండ్రి తన కొడుకు కోసం ఇచ్చిన ప్రకటన చూసి మేమే వారసులం అంటూ ఆ ఇంట్లోకి చేరతారు.. ? తర్వాతేమైందీ అనేది మిగతా కథ.

తర్వాతేమైందీ అనే ప్రశ్నకు సమాధానం సినిమా చూడకుండానే తెలిసిపోతుంది కదా..? నిజమే.. అసలు ఆ ముందు జరిగిన దాంట్లో కొత్తదనం ఏముందీ అనుకుంటున్నారు కదూ.. యస్.. ఈ రెండూ నిజమే. ఏ మాత్రం కొత్తదనం లేని కథ. అస్సలే మాత్రం కొత్తగా అనిపించని కథనం. ఒక్కచోట కూడా నవ్వు తెప్పించని రచన.. ఒక్కో సీన్ కు రెండు మూడు సినిమాలు కనిపిస్తుంటే చూసే ఆడియన్స్ లోనే ఫ్రస్ట్రేషన్ తప్ప సినిమాలో ఏ మాత్రం కనిపించని ఫన్.. వెరసి.. ప్రేక్షకుల స్థాయిని తక్కువగా భావించి ఏం రాసినా నవ్వుతారు.. ఏం తీసినా చూస్తారులే అని చవకబారు కథ, కథనాలతో అనిల్ రావిపూడి వండిన ఈ కిచిడీ సినిమా చూస్తే నిజంగా కోపం వస్తుంది. ఆ స్థాయిలో తీశాడతను. ఫస్ట్ హాఫ్ లో కొన్ని నవ్వులు కనిపిస్తాయి. అదీ అలీ సీక్వెన్స్ లోనే. మిగతా ఫస్ట్ పార్ట్ లో సీన్స్ రిపీట్ అయినట్టుగా కనిపిస్తాయి. అసలు కూతుళ్లను పరాయివాడి ‘మర్దనా’ చేయమని చెప్పే తల్లులు మెయిన్ స్ట్రీమ్ సినిమాలో కామెడీ పేరుతో వచ్చారంటే అనిల్ రావిపూడి వివేచన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్, స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తున్నప్పుడు.. అదీ లేడీస్ ఫాలోయింగ్ ఉన్న హీరో( మరి ఆయనకైనా ఉండక్కర్లా అనిపిస్తే తప్పులేదు). పోనీ సీన్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా అంటే అప్పుడెప్పుడు ‘అమ్మో ఒకటో తారీఖు’ అనే సినిమాలో సురేష్, ముంతాజ్ ల మధ్య వచ్చే ఎపిసోడ్ ను అచ్చంగా లేపిసి వరుణ్ తేజ్, మెహ్రీన్ ల మధ్య పెట్టిన గొప్ప ‘కలం’ అనిల్ రావిపూడిది.

ఇక ఒక పెద్దాయన చిన్నప్పుడు తప్పి పోయిన కొడుకు కోసం ప్రకటన ఇస్తే కేవలం ఈ ముగ్గురే రావడం దర్శకుడికే తెలియాలి. దరిద్రం ఏంటంటే.. కొడుకుగా తమన్నాకు మగ గెటప్ వేయించి మరీ నాలుగో కొడుకుగా రంగంలోకి దించడం, మగవేషంలో ఉన్న తమన్నాను సోనాల్ చౌహాన్ ‘‘మ్యాన్లీ’’గా ఉన్నాడని ప్రేమించడం లాంటి సీన్స్ చూస్తే అతని క్రియేటివిటీ ఎంత దిగజారుడుగా ఉందో తెలిసిపోతుంది. పైగా ఈ తరహా ఎపిసోడ్స్ 80ల్లోనే వచ్చాయి. పోనీ కొత్తగా ఏమన్నా రాశాడా అంటే అదేం లేదు. ఇక క్లైమాక్స్ మరింత చీప్ గా కనిపిస్తుంది.
నటుల పరంగా అనిల్ ఏం చెప్పినా అదో వేద వాక్కులా భావించారో లేక ఎఫ్2 హిట్ కాబట్టి.. ఇదీ అవుతుందీ అనుకున్నారో కానీ ఏం జరుగుతుందీ అని మినిమం కూడా ఆలోచించకుండా నటించేశారు. పాత్రలో ఛాలెజింగ్స్ ఏం లేవు కాబట్టి.. నటన గురించి చెప్పేదేం లేదు. ఇక తమన్నా పాత్ర సెకండ్ హాఫ్ లో ఇరిటేట్ చేస్తుంది.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో ఐటమ్ సాంగ్ బావుంది. ఎడిటింగ్ పరంగా చెప్పేదేం లేదు. సినిమాటోగ్రఫీ బావుంది. ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.. చాలా ఖర్చు కూడా పెట్టారు. దర్శకుడుగా అనిల్ రావిపూడి మరో శ్రీను వైట్ల కావడానికి ఇది తొలి అడుగులా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అస్సలే మాత్రం కొత్తదనం లేని కథ,కథనం, మాటలతో మాగ్జిమం బోర్ కొట్టించాడు.

ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్ :
రెస్టాఫ్ ద మూవీ

ఫైనల్ గా : మినిమం ఫన్.. మాగ్జిమం ఫ్రస్ట్రేషన్..

రేటింగ్ : 2/5

Related Posts