రౌడీస్టార్ విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్

టాలెంట్ కు లక్ తో తోడైతే టాక్సీవాలా కూడా అర్జున్ రెడ్డి అవుతాడు. గీత తో కలిసి గోవిందుడులా బాక్సాఫీస్ బృందావనంలో విహరిస్తాడు అనేందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ. చిన్న పాత్రలతో మొదలై.. తక్కువ టైమ్ లోనే హీరోగా మారి.. అంతే షార్ట్ పీరియడ్ లో టాప్ రేస్ లోకి వచ్చి అనూహ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీ వరకూ వెళ్లిన విజయ్ ది కేవలం టాలెంట్ మాత్రమే కాదు.. లక్ కూడా. ప్రస్తుతం యూత్ లోతిరుగులేని క్రేజ్ తెచ్చుకుని రౌడీస్టార్ అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ బర్త్ డే ఇవాళ.
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు టివి సీరియల్ డైరెక్టర్. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. విజయ్ దేవరకొండ పుట్టపర్తిలో చదువుకుని.. తర్వాత హైదరాబాద్ లో బికామ్ చేశాడు. అటుపై సినిమాలు ప్రయత్నాలు చేస్తూ.. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో కీలక పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. నాని హీరోగా నటించిన ఈ మూవీతో విజయ్ కి మంచి బ్రేక్ వచ్చింది. కానీ హీరోగా కాదు.


నటుడు కావాలనుకున్నప్పుడే థియేటర్స్ లో నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. మరీ ఎక్కువ కాదు కానీ.. అక్కడే నటనను మెరుగు పరచుకున్నాడు విజయ్. ఇక 2016లో వచ్చిన పెళ్లి చూపులు తెలుగులో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈమూవీ కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ అద్భుతమైన అప్లాజ్ అందుకుంది. కేవలం కోటిలోపు బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా 30కోట్లు కలెక్ట్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. అటు విజయ్ కి కూడా హీరోగా మంచి పేరు వచ్చింది. పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ అతని కెరీర్ కు పెద్ద బూస్టప్ అని చెప్పాలి.


పెళ్లి చూపులు క్రేజ్ తో వరుస ఆఫర్స్ వస్తాయి అనుకున్నా.. అలా జరగలేదు. కారణం అతని తెలంగాణ స్లాంగ్. అప్పుడప్పుడే సినిమాల్లో ప్రధానంగా మారుతోన్న టైమ్ అది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్ ఎవరూ అతనివైపు రాలేదు. దీంతో ఎవరొచ్చినా సరే అన్న బోర్డ్ కు న్యాయం చేస్తూ ద్వారక అనే రెగ్యులర్ మూవీ చేశాడు. బట్ ఇది పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ పెళ్లి చూపులు తర్వాత అతని నటనలో మరో యాంగిల్ చూపించిన సినిమాగా నిలిచింది.


విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే పాథ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది అర్జున్ రెడ్డి. ఈ మూవీకి ముందు కూడా అతను మరో సినిమా చేశాడు. కానీ విడుదల కాలేదు. పెళ్లి చూపులు తర్వాత మరోసారి కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో చేసిన అర్జున్ రెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. సినిమాను ఇలా కూడా తీయొచ్చా అని కొత్తగా వచ్చే కుర్రాళ్లు మరింత కొత్తగా ఆలోచించేలా చేసింది. అదే టైమ్ లో కొన్ని వర్గాల వారి విమర్శలనూ ఫేస్ చేసింది. అయినా సినిమా మాత్రం కమర్షియల్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది.


ఓ రకంగా అర్జున్ రెడ్డి లాంటి సినిమాను ఇండియన్ ఆడియన్స్ కూడా అంతకు ముందు చూడలేదు. అలాగే టైటిల్ రోల్ లో విజయ్ దేవరకొండ నటనకు ఫిదా కాని వారు లేరు. అధర చుంబనాలు కాస్త అతిగా అనిపించినా.. అవన్నీ కథనంలో కలిసిపోయాయి. ఎబ్బెట్టుగా లేకపోవడంతో మెచ్యూర్డ్ ఆడియన్స్ ను సైతం మెప్పించగలిగారు. అర్జున్ రెడ్డితో విజయ్ .. రాత్రికి రాత్రే స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.
తనకు నటుడుగా గుర్తింపు తెచ్చిన నాగ్ అశ్విన్ కోసం మహానటి సినిమాలో ఓ కీలక పాత్ర చేశాడు. సమంతతో పాటు కలిసి నటించిన ఈ పాత్ర సినిమాను ముందుకు నడిపించేదిగా కనిపిస్తుంది. ఆ పాత్రలోనూ వింటేజ్ జర్నలిస్ట్ గా నటించి ఆకట్టుకున్నాడు విజయ్. అటుపై అతని కెరీర్ ను మరో టర్న్ తిప్పిన సినిమాగా వచ్చింది గీత గోవిందం. పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరి.. విజయ్ ది లక్ అని విమర్శించిన వారి నోళ్లు మూయించింది. బాధ్యతాయుతమైన అన్నయ్యగా.. ఓచిన్న తప్పు కారణంగా హీరోయిన్ చేత అనేక ఇబ్బందులకు గురయ్యే పాత్రలో అద్బుతంగా నటించాడు.


వరుస విజయాలు వచ్చాయనో లేక.. ఓవర్ ఫేమ్ వచ్చిందనో కానీ.. గీత గోవిందం తర్వాత విజయ్ అడుగులు తడబడ్డాయి. బై లింగ్వుల్ ప్రాజెక్ట్ అనే టెంప్టేషన్ తో చేసిన నోటా డిజాస్టర్ అనిపించుకుంది. టాక్సీవాలా కాస్త ఫర్వాలేదనిపించుకున్నా.. అర్జున్ రెడ్డి, గీత గోవిందంల సరసన నిలబడేది కాదు. భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ కూడా బాక్సాఫీస్ వద్ద పోయింది. పైగా ఈ చిత్రంలో తన హిట్ పెయిర్.. సోషల్ మీడియా క్రియేట్ చేసిన లవర్ రష్మికమందన్నా కూడా నటించినా అంచనాలు అందుకోలేకపోయింది. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ మరోసారి అదే స్థాయి అంచనాలతో వచ్చిన చిత్రం కూడా పోయింది. ఈ సినిమాలో మూడు భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించాడు. నటుడుగా సత్తా చాటినా.. కథా, కథనంలో బలం లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అనిపించుకుందీ చిత్రం.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో లైగర్ అనే సినిమాతో రాబోతున్నాడు విజయ్. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ బాక్సర్ గా నటించాడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని పూరీతో పాటు బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ ధర్మావాళ్లు కూడా యాడ్ అయ్యారు. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. మొత్తంగా ఈ రెండు సినిమాలతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం..

Related Posts