ప్రేక్షకుల కోసం వర్మ అందిస్తోన్న అరుదైన అవకాశం ‘యువర్ ఫిల్మ్‘

అవధుల్లేని ఆలోచనాసరళి, విలక్షణమైన వ్యక్తిత్వం, వివాదాలంటే ప్రియత్వం.. వెరసి రామ్ గోపాల్ వర్మ. ఈ అంశాలే వర్మని మిగతా దర్శకుల్లోకి ప్రత్యేకంగా నిలుపుతాయి. ఒకప్పుడు దర్శకుడిగా తన తరం వారికంటే ఎంతో భిన్నంగా ఆలోచించి.. వెండితెరపై ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేశాడు. టెక్నికల్ గానూ వర్మ సినిమాలు ఎంతో అడ్వాన్డ్స్ గా ఉంటాయి. ఇక.. ప్రస్తుతం డైరెక్టర్ గా క్రేజ్ తగ్గినా.. కొత్త ఆలోచనల పరంగా ఇప్పటికీ తనకు తానే సాటి అని నిరూపిస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘యువర్ ఫిల్మ్‘ పేరుతో ప్రేక్షకుల కోసం ఓ ప్రకటన చేశాడు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం అలానే ప్రేక్షకుల చేత, ప్రేక్షకుల కొరకు, ప్రేక్షకుల కోసం చేసే సినిమాలే ఈ యువర్ ఫిల్మ్ ఐడియా అంటూ.. తన ఐడియా గురించి వివరంగా తెలిపాడు వర్మ.

RGV డెన్ వేదికగా ఈరోజు రామ్ గోపాల్ వర్మ ‘యువర్ ఫిల్మ్’ అనే కాన్సెప్ట్ ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు. ప్రేక్షకులే సినిమా హిట్ ఫ్లాప్ నిర్ణయిస్తారు కాబట్టి, ఆ ప్రేక్షకులే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అందరు టెక్నీషియన్స్ ను ఎన్నుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. RGV వెబ్సైట్ ద్వారా ఓటింగ్ పద్దతిలో, ప్రేక్షకులే ఎన్నుకుని, అందులో ముందంజలో ఉన్న వారితో సినిమా చిత్రీకరణ ఉంటుందని.. ఆ చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరించి ఆరు నెలల్లో పూర్తిచేసి విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ.

సినిమా కథనీ RGV వెబ్సైటులో (rgvden.com) ఒక రెండు లైన్లులో పెట్టి, ఆ కథ లైను నచ్చిన ఆక్టర్స్, డైరెక్టర్స్, డిఓపి, మూజిక్ డైరక్టర్ ఇలా అందరూ కూడ అప్లై చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఇంటరెస్ట్ ఉండి అప్లై చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ వారికి, ఎవరి వర్క్ నచ్చిందో వారిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు.. ఉదాహరణకి హీరో కొసం ఒక 1000 మంది అప్లై చేస్తే అందులో నుండి ఒక 50 మందిని RGV డెన్ టీమ్ షార్ట్ లిస్ట్ చేసి వెబ్సైట్ లో పెడతారు, ఆ తరవాత RGV పెట్టే టాస్క్ లని బట్టి వారు ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు.

ఆ ఆడిషన్స్ లో ప్రేక్షకులకు ఎక్కువ ఎవరు నచ్చితే అతను హీరోగా సినిమా తీస్తారు. ఇదే తరహాలో హీరోయిన్, డైరెక్టర్స్, డిఓపి ఇలా అందరూ కూడా ప్రేక్షకుల ద్వారా ఎన్నుకోబడతారు.. అని వర్మ తెలిపాడు. ఇక.. ‘యువర్ ఫిల్మ్‘ అనేది భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల వారితో నిర్మాణం RGV డెన్ నుండి జరుగుతుంది.

Related Posts