మను చరిత్ర


తారాగణం : శివ కందుకూరి, మేఘా ఆకాశ్, ప్రియ వడ్లమాని, సుహాస్, మధునందన్, ప్రతితి శ్రీ వాత్సవ్ తదితరులు
ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీ వాత్సవ్
సంగీతం : గోపీ సుందర్
నిర్మాత : నరాల శ్రీనివాస రెడ్డి
దర్శకత్వం : భరత్ పెద్దగాని

నిర్మాత రాజ్ కందుకూరి వారసుడుగా వచ్చాడు శివ కందుకూరి. మొదటి సినిమా చూసీ చూడంగానే. తర్వాత గమనం అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇప్పటి వరకూ నటుడుగా ఏ ఇంపాక్ట్ కనిపించలేదు. కానీ మను చరిత్ర అనే మూవీ టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ ఇంప్రెసివ్ గా ఉంది. ఈ మూవీ కుర్రాడికి బ్రేక్ ఇస్తుందని అంతా భావించారు. మరి అలా భావించినట్టుగా మను చరిత్ర మెప్పించిందా..? శివకు ఈ మూవీ బ్రేక్ ఇస్తుందా అనేది చూద్దాం.

కథ :
మను దుర్గరాజు అలియాస్ మను (శివ కందుకూరి) వరంగల్ లో నివసిస్తుంటాడు. కనిపించిన అమ్మాయినల్లా ప్రేమిస్తుంటాడు. వారిలో ఏ చిన్న లోపం కనిపించినా.. క్షణం కూడా ఆగకుండా బ్రేకప్ చెప్పేస్తుంటాడు. పైగా తను ప్రేమించినంత కాలం నిజాయితీగానే ఉంటాడు. వారికోసం ఏమైనా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక అమ్మాయి వాళ్ల అన్న చేతిలో చావు దెబ్బలు తింటాడు. మరో అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ అంటే ఆపరేషన్ డబ్బుల కోసం లోకల్ రౌడీ వద్ద అతనితో పాటు పనిచేస్తానని పాతికలక్షలు అప్పు తెచ్చి మరీ ఆమెకు ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. కట్ చేస్తే తనకు అసలు బ్రెయిన్ ట్యూమర్ ఉండదు. తనతో గేమ్ ఆడినందుకు తనపై చేయి చేసుకుంటాడు మను. దీంతో ఇదంతా తన ప్లాన్ అంటూ అతనితో బ్రేకప్ అయిన మరో హీరోయిన్ వస్తుంది. మరి మాతో ఎందుకు ఆడుకున్నావ్ అంటూ నిలదీస్తుంది. దీనికి మను ఫ్రెండ్ లైన్లోకి వస్తాడు. అతనెందుకు అలా అయ్యాడో నేను చెబుతానంటూ మొదలుపెడతాడ. మరి అతనేం చెప్పాడు. మను ఎందుకు అలా అయ్యాడు అనేది మిగతా కథ.

విశ్లేషణ :
మను చరిత్ర.. రకరకాల సినిమాలను చూసి ఇన్స్ స్పైర్ అయ్యి.. అందులో నుంచి ఓ కథ తయారు చేశాం అనుకుని ఉంటారు. కానీ అన్ని పార్ట్స్ లోనూ ఆయా సినిమాలు కనిపిస్తుంటాయి. ఏళ్ల క్రితం వచ్చిన సినిమాల నుంచి అర్జున్ రెడ్డి వరకూ అన్ని సినిమాల ఛాయలూ కనిపిస్తుంటాయి. పోనీ వేరే కథల నుంచి ఇన్ స్పైర్ అయినా.. ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి కదా.. అంటే అదీ లేదు. మళయాలీలకు కూడా నీరసం వచ్చేంత స్లో నెరేషన్. సాగదీతకు సరికొత్త నిర్వచనంలా కనిపిస్తుంది. ఓ రకంగా మెయిన్ పాయింట్ బావుంది. ప్రేమించిన అమ్మాయి వదిలి వెళితే.. చాలామంది మందు, మత్తుకు బానిసలవుతుంటారు. కానీ ప్రేమ చేసిన గాయాన్ని మాన్పేందుకు మళ్లీ ప్రేమకు మించిన డ్రగ్ లేదని చెప్పడం దర్శకుడి భావన. కాకపోతే అది రకరకాల దారుల్లో వెళ్లి ఆఖర్లో కలిసింది. ఈ దారులన్నీ ఆడియన్స్ కు ఆల్రెడీ తెలిసినవే కాబట్టి.. ఏమంత కొత్తదనం కనిపించదు. బట్ లవ్ కోసం రౌడీ అవుతాను అనే పాయింట్ బావుంది. అయినా ఆ పాత్రలో ఈ హీరో శివ స్టేచర్ సరిపోలేదు. ఇంకా చెబితే అతని బాడీలో అసలు ఏ రిథమ్ లేదు. డ్యాన్స్ రాద. ఫైట్స్ సైతం పట్టి పట్టి చేస్తున్నట్టుగా ఉంది.. తప్ప ఏ మాత్రం సహజత్వం లేదు. అయినా ఈ కథను మోసే ప్రయత్నం బానే చేశాడు అనిపిస్తుంది.


అప్పటి వరకూ అమ్మాయిలను ప్రేమిస్తూ బ్రేకప్ చెప్పే మను.. కాలేజ్ లో ఉండగా ఓ అమ్మాయిన ప్రేమిస్తాడు. పేరు జెన్నిఫర్(మేఘా ఆకాశ్). మను కాలేజ్ టాపర్. పెద్ద కాలేజ్ సీట్ వచ్చినా.. జెన్నీ కోసం వరంగల్ కాలేజ్ లోనే జాయిన్ అవుతాడు. వీరి పెద్దల నుంచి కూడా పెద్దగా అభ్యంతరం ఉండదు. అంతా సానుకూలం అనుకుంటున్న టైమ్ లో అప్పటి వరకూ కనిపించిన హీరో ఫ్రెండ్ లవర్ తెరపైకి రావడం.. ఆమె బంధువులు సదరు ఫ్రెండ్ పై దాడి చేయడం జరుగుతుంది. దీంతో హీరో వీరావేశంలో వెళ్లి తన ఫ్రెండ్ ను కొట్టిన వారిపై తిరగబడతాడు. అది కాస్తా గ్రూపుల తగాదాగా మారుతుంది. రెండు వర్గాలు చేరతాడు. అందులో ఓ వర్గం వాడు హీరోయిన్ అన్న. ఇంకేం.. ఇంక వీరి ప్రేమకథ సుఖాంతం అనుకున్న టైమ్ లో ఇలాంటి రౌడీకి నిన్ను ఇవ్వం అని హీరోయిన్ అన్నలు తెగేసి చెప్పడం.. వేరే వ్యక్తి(రాజ్ తరుణ్‌)కి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లిని అడ్డుకునేందుకు వస్తోన్న మనుకు యాక్సిడెంట్ అవుతుంది. ఈ గ్యాప్ లో ఆమె భర్తతో దుబాయ్ కి వెళ్లిపోతుంది. ఇలా ప్రేమలో ఫెయిల్ అవడం వల్ల మరో అమ్మాయిలో తన జెన్నీఫర్ ని చూసుకునే ప్రయత్నాల్లో ఆమె కనిపించక అందరికీ బ్రేకప్ చెబుతుంటాడు.

ఇటు రౌడీకిఇచ్చిన మాటకోసం అతని వద్ద పనిచేస్తూ అందరినీ కొడుతూ అదే పనిగా తాగుతూ డ్రగ్స్ కూడా సేవిస్తుంటాడు. ఈ టైమ్ లో అతనికి మరో అమ్మాయి పరిచయం అవుతుంది. అక్కడి నుంచి అతనిలో కొత్త ప్రేమ చిగురిస్తుంది. మరి ఈ ప్రేమ అయినా నిలబెట్టుకున్నాడా లేదా అనేది క్లైమాక్స్ వరకూ అత్యంత సాగదీతతో సాగే ప్రహసనం.

టెక్నికల్ గా మ్యూజిక్ బావుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పరంగా దర్శకుడి ఆలోచనకే కట్టుబడినట్టు ఉండటం వల్లే ఇంత సాగదీతగా ఉందనుకోవచ్చు. మాటలు ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. పాటల్లో సాహిత్యం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకడుగా భరత్ చెప్పాలనుకున్నది ప్రేమ వైఫల్యానికి బెస్ట్ డ్రగ్ మళ్లీ ప్రేమే అనే పాయింట్. ఈ కోణంలో పెద్దగా సినిమాలు రాలేదు. కానీ అతను ఈ కథను చెప్పడానికి ఎంచుకున్న ప్లాట్స్ అన్నీ రొటీన్ గానే ఉన్నాయి. స్లో నెరేషన్ సహనానికి పరీక్ష పెడితే.. హీరో మందు తాగే సీన్స్, డ్రగ్స్ వ్వవహారం మరీ శ్రుతి మించి కనిపిస్తాయి. వరంగల్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువ భాగం అక్కడే చిత్రీకరించడంతో మంచి ఫీల్ వస్తుంది. కానీ ప్రేమకథను కూడా ఫీలయ్యేలా రాసుకుంటే ఇంకా బావుండేది.

ఫైనల్ గా : ఇలాంటి చరిత్రలు చాలానే చూశాం.

రేటింగ్ : 2/5

            - బాబురావు కామళ్ల

Related Posts