ఏజెంట్

రివ్యూ : ఏజెంట్
తారాగణం : మమ్మూట్టి, అఖిల్, సాక్షి వైద్య, డినో మోరియో, విక్రమ్ జీత్ తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : రసూల్ ఎల్లోర్
సంగీతం : హిప్ హాప్ తమిళ
నిర్మాతలు : రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, దీపారెడ్డి
దర్శకత్వం : సురేందర్ రెడ్డి

కొన్ని సినిమాలకు సంబంధించి అనౌన్స్ అయినప్పుడు ఆసక్తి వస్తుంది. ఆ తర్వాత దాన్ని పెంచుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది ప్రొడక్షన్ హౌస్. మరికొన్ని సార్లు ఈ ఆసక్తి రోజు రోజుకూ ఆసక్తి తగ్గేలా అనేక కథనాలు వస్తుంటాయి. వీటిని ఖండించాల్సిన సదరు చిత్ర టీమ్.. ఖండించరు. దీంతో ప్రేక్షకుల్లో అనుమానాలు పెరుగుతాయి. ఏజెంట్ విషయంలో ఇదే జరిగింది. పైగా నాలుగైదు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేశారు. ఫైనల్ గా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది ఏజెంట్. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో కాస్త హల్చల్ చేశారు. మరి ఇదంతా సినిమాకు ప్లస్ అయింది.. లేట్ అయినా ఈ మూవీ ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..

కథ :
మహదేవ్( మమ్మూట్టి) రా ఏజెన్సీ చీఫ్. ఎన్నో సక్సెస్ ఫుల్ ఆపరేషన్స్ తో దేశాన్ని కాపాడుతూ డిపార్ట్మెంట్ లో డెవిల్ అనే పేరు తెచ్చుకుంటాడు. గాడ్ అనే పేరుతో భారత దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ధర్మ( డినో మోరియా). పక్క దేశాలతో కల్సి ఒక భారీ కుట్రకు ప్లాన్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసినా.. గాడ్ ప్లాన్ ఏంటో ఖచ్చితంగా తెలియదు మహదేవ్ కు. అది కనిపెట్టేందుకు తను పంపించిన రా ఏజెంట్స్ అందరినీ కనిపెట్టి చంపుతుంటాడు గాడ్. ఇక చిన్నప్పటి నుంచి రా ఏజెంట్ కావాలని కలలు కంటుంటాడు రామకృష్ణ (అఖిల్). ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. తీరా తను దక్కే టైమ్ కు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. తను రా ఏజెన్సీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారి రిజెక్ట్ అవుతుండటం తో రా ఆఫీస్ సిస్టం ను హాక్ చేసి వారినే తనవద్దకు రప్పించుకుంటాడు. అలా కొన్ని టెస్ట్ ల తర్వాత అతన్నీ ఏజెన్సీ లోకి ఇండైరెక్ట్ గా తీసుకుంటాడు మహాదేవ్. గాడ్ చేస్తోన్న విధ్వంసాన్ని కనిపెట్టి ఆపే బాధ్యత రిక్కీకి అప్పజెబుతాడు. ముందు ఒప్పుకున్నా.. తర్వాత డెవిల్ చెప్పిన మాట వినకుండా తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటాడు రిక్కీ. మరి రామకృష్ణ అలియాస్ రిక్కీ మహదేవ్ ఆదేశాలను ఎందుకు పట్టించుకోడు. అసలు ఈ ధర్మ అలియాస్ గాడ్ ఎవరు..? వారు తలపెట్టిన విధ్వంసం ఏంటీ..? దాన్ని మహదేవ్ ఎలా ఆపాడు అనేది కథ.

విశ్లేషణ :
మామూలుగా ఈ తరహా చిత్రాలన్నీ ఒకే టోన్ తో స్టార్ట్ అవుతాయి. అదే టోన్ లో సాగుతాయి. కానీ మేం అందుకు భిన్నంగా వస్తున్నాం అని చెప్పేందుకు హీరోకు కాస్త తిక్క పెట్టాడు దర్శకుడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. రా ఏజెన్సీ చీఫ్.. అతనో ఆపరేషన్ లో ఫెయిల్ అవుతుండటం.. అందుకోసం సరైన వాడికోసం వెదుకుతుండటం అనేదే ఈ చిత్రంలోనూ ఉన్న పాయింట్. అయితే ఈ మూవీలో రా వాళ్లు రిజెక్ట్ చేస్తే .. చివరికి వాళ్లే తనను తీసుకునేలా చేయడం కొత్తగా ఉంటుంది. ఈ కొత్త పాయింట్ ను చెత్తగా ఇంప్లిమెంట్ చేశాడు దర్శకుడు. కథ పురాతనమే అయినా కథనంలో కొత్తదనం బూతద్దం పెట్టి వెదికినా కనిపించదు. అసలు ఏ సీన్ ఎందుకు వస్తుంది.. ఎప్పుడు వెళుతుంది అనేదే తెలియదు. ఇక పాటలైతే ఓ టార్చర్. పాటలు అసలు బాలేదు అనుకుంటే వాటి ప్లేస్మెంట్ వరస్ట్ గా ఉంది. ఒక సీన్ లో హీరోయిన్ ను ఎమ్.పి కొడుకు అవమానిస్తాడు. తనతో గడపాలని బలవంతం చేస్తాడు.అది తెలిసిన హీరో సదరు ఎమ్.పి ఇంటికి వెళ్లి ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. అప్పటి వరకూ చప్పగా సాగిన సినిమాలో సడెన్ గా హై మూమెంట్ ఇస్తుందీ సీన్. ఆ మూమెంట్ ను ఆడియన్స్ ఎంజాయ్ చేసేలోపే.. అస్సలేమాత్రం సందర్భ శుద్ధి లేకుండా పాట పెట్టేశారు. ఇలాంటివి అనేకం. ఇక పోర్ట్ లో సాగిన తుపాకుల యుద్ధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ బుల్లెట్లు నేరుగా ప్రేక్షకులకే తాకినంత దారుణంగా ఉంటాయి. ఎంత సినిమాటిక్ లిబర్టీ అయినా ఇంత ఓవరాక్షన్ చేస్తే అభిమానులు కూడా భరించలేరు. ఎప్పుడైతే రిక్కీ రా ఏజెంట్ గా మారాడో.. ఆ క్షణం నుంచి క్లైమాక్స్ వరకూ సినిమా మొత్తం ఊహించినట్టుగానే సాగుతుంది. పైగా సెకండ్ హాఫ్ లో ఒకట్రెండు సీన్స్ తర్వాత హీరోయిన్ ను పూర్తిగా వదిలేశారు కూడా. ఎలా చూసినా.. ఏజెంట్ ఫార్మాట్లో సాగిన ఏ మాత్రం కొత్తదనం లేని సినిమా ఏజెంట్. ప్రేక్షకులను తక్కువ అంచనా వేసి చూస్తేనే దర్శకులు ఈ తరహా సీన్స్ రాసుకుంటారు. అలా ఆడియన్స్ ను డీ గ్రేడ్ చేయాలని చూస్తే వీళ్లు బి గ్రేడ్ సినిమాలకు పరిమితం అవుతారు.. తప్ప మంచి దర్శకులు అనిపించుకోలేరు.


నటన పరంగా అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఒళ్లు హూనం చేసుకున్నాడు. కానీ కథలో పస లేనప్పుడు వీళ్లు ఎన్ని స్టంట్స్ చేసినా ఏం ఉపయోగం ఉండదు అని ఏజెంట్ మరోసారి ప్రూవ్ చేస్తుంది. పైగా ఇది అఖిల్ కు కాస్ట్ లీ డిజాస్టర్ కూడా. హీరోయిన్ జస్ట్ ఓకే. తనను గ్రాండ్ గా ఇంటర్ డ్యూస్ చేసి మళ్లీ రెగ్యులర్ హీరోయిన్ లా మార్చేశారు. మిగతా పాత్రల్లో మమ్మూట్టి గురించి చెప్పుకోవాలి. అతను మాత్రమే సినిమాకు ఏకైక ప్లస్ పాయింట్. మహదేవ్ గా మమ్మూట్టి ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా హుందాగా ఉందీ పాత్ర. తను ఉన్నంత సేపు సినిమా బావున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన చనిపోయే సీన్ మాత్రం బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, మురళీ శర్మ లాంటి వారివి రొటీన్. ఇక గాడ్ అలియాస్ ధర్మగా విలన్ పాత్రలో డినో మోరియో అదరగొట్టాడు. బట్.. ముందే చెప్పినట్టు కథలో దమ్ము లేనప్పుడు ఆర్టిస్టులు ఎంత హై ఇచ్చినా ఆడియన్స్ హే.. విజిల్స్ కొట్టలేరు కదా..?


టెక్నికల్ గా ఈ చిత్రానికి సంగీతం, పాటలు బిగ్గెస్ట్ మైనస్. ఒక్క పాటా ఆకట్టుకోదు. ప్లేస్మెంట్ ఏ మాత్రం సరిగా లేదు. అటు నేపథ్య సంగీతం కూడా చాలాసార్లు విన్నట్టుగానే ఉంటుంది. ఎడిటింగ్ పరంగా దర్శకుడిదే ఫైనల్ డెసిషన్ కాబట్టి.. అతన్ని ఏమీ అనలేం. మాటల్లో పస లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి కానీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇంత టైమ్ ఉన్నా.. ఎందుకు క్వాలిటీ విషయంలో సీరియస్ గా లేరో వారికే తెలియాలి. ఇక దర్శకుడుగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటే నమ్మలేం. అంత ఇల్లాజికల్ గా, సిల్లీగా ఉంటుంది. తనే తీసిన కిక్ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ ను రా ఏజెన్సీలోకి పంపించినట్టుగా భావించాడేమో కానీ.. అఖిల్ పాత్ర అక్కడక్కడా కిక్ లో రవితేజను గుర్తు చేస్తుంది. బట్ ఇప్పుడు కిక్ టైప్ హీరోయిజానికి కాలం చెల్లింది కదా..? ఏదేమైనా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారికీ మరో భారీ హోల్ లా ఉందీ చిత్రం.

ఫైనల్ గా : వైల్డ్ అటాక్ ఆన్ ఆడియన్స్

రేటింగ్ : 1.5/5

                    - బాబురావు. కామళ్ల.

Related Posts