‘యానిమల్‘ రివ్యూ

తారాగణం : రణబీర్ కపూర్, అనిల్ కపూర్‌, బాబీ డియోల్‌, రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి, పృథ్వీరాజ్‌, శక్తి కపూర్‌, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్, రవి గుప్తా, సిద్ధాంత్ కర్నిక్ త‌దిత‌రులు
సంగీతం : విశాల్ మిశ్రా, జాని, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్, హ‌ర్ష వర్థన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ : అమిత్ రాయ్
నిర్మాతలు : భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
విడుదల తేదీ : 01-12-2023

‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర సృష్టించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ గా చేసి అక్కడా సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా తన మూడో సినిమా ‘యానిమల్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో విడుదలైన ‘యానిమల్‘ ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో సఫలమైందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో తండ్రి బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్.. కొడుకు రణ్ విజయ్ సింగ్ గా రణ్ బీర్ కపూర్ నటించారు. స్వస్తిక్ స్టీల్స్ అనే పెద్ద సంస్థను నడుపుతుంటాడు బల్బీర్ సింగ్. ఆయన బిజీ బిజినెస్ మేన్ కావడంతో కొడుకుకి అసలు సమయం కేటాయించలేకపోతుంటాడు. ఇక.. తన తండ్రంటే కొడుకు రణ్ విజయ్ సింగ్ కి అమితమైన ప్రేమ. అయితే దూకుడు మనస్తత్వం వున్న విజయ్ పనులు తండ్రి బల్బీర్ కి నచ్చవు. ఈక్రమంలోనే వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. ఈలోపులో గీతాంజలి (రష్మిక)తో ప్రేమలో పడ్డ రణ్ విజయ్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లపోతాడు. తండ్రి బల్బీర్ సింగ్ పై హత్యాహత్నం జరగడంతో తిరిగి ఇండియా వస్తాడు. అసలు బల్బీర్ సింగ్ ను చంపాలనుకున్న వారెవరు? ఆ శత్రువులపై విజయ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ఆ తర్వాత జరిగే కథ.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యద్భుతమైన నటుల్లో రణ్ బీర్ కపూర్ ఒకడు. ఒకవిధంగా ఈ సినిమా మొత్తాన్ని రణ్ బీర్ తన భుజాల మీద మోసాడు అని చెప్పొచ్చు. రణ్ బీర్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉన్నాయి. తెరపై మనకు రణ్ విజయ్ సింగ్ మాత్రమే కనిపిస్తాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు రణ్ బీర్ కపూర్. రణ్ బీర్ తర్వాత మళ్లీ అంత ప్రాధాన్యమున్న మరో పాత్ర అనిల్ కపూర్ ది. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించి, త‌న కొడుకుకి ఇవ్వాల‌నుకున్న ఓ తండ్రిగా అనిల్ నటన బాగుంది. ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనిపించిన రష్మికకు ఈ సినిమాలో బలమైన పాత్ర దక్కింది. ప్రేయ‌సిగా, ఇద్దరు పిల్లల త‌ల్లిగా మెచ్యూర్డ్ రోల్ లో కనిపించింది రష్మిక. హీరో రణ్ బీర్ కి దీటైన ప్రతినాయకుడిగా బాబీ డియోల్ అదరగొట్టాడు. ఇంకా.. త్రిప్తి డిమ్రి, శ‌క్తిక‌పూర్, సిద్ధార్థ్ కార్నిక్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. టెక్నికల్‌గా ‘యానిమల్’ ఉన్నత స్థాయిలో కనిపించింది.
‘అర్జున్ రెడ్డి‘ సినిమాతో యూత్ ని టార్గెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా మళ్లీ ‘యానిమల్‘తో యూత్ ని మెప్పించాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాలా వైలెంట్ గా చూపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశాడు. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీతగా సాగింది. మొత్తంగా మూడున్నర గంటలపాటు ఆడియన్స్ ని థియేటర్లో కూర్చోబెట్టడంలోనే దర్శకుడు సక్సెస్ సాధించాడనే చెప్పొచ్చు. సంగీతం పరంగా హర్షవర్థన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం థియేటర్ నుంచి బయటకు వచ్చినా వెంటాడుతూనే ఉంటుంది. అమిత్‌రాయ్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఈ మూవీ ఒక డబ్బింగ్ సినిమాలా కాకుండా ఒక స్ట్రెయిట్ మూవీ అనే ఫీల్ వచ్చింది. అందుకు ప్రధాన కారణం రచయిత రాకేందు మౌళి రాసిన డైలాగ్స్, అనంత్ శ్రీరామ్ రాసిన పాటలు.

Related Posts