హిట్ మెషీన్ నాని ఆట మొదలై 15యేళ్లు

15యేళ్ల క్రితం.. అంటే 2008 సెప్టెంబర్ 5న.. నటన నా రక్తంలోనే ఉందంటూ తెలుగు తెరపై వారసులంతా ఓ రేంజ్ లో రెచ్చిపోతోన్న టైమ్ లోనే ఓ కుర్రాడు తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. పేరు నాని. సినిమా పేరు అష్టాచెమ్మా.

ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఎవరో కూడా తెలియదు. బట్ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేశాడు. ఇతనేంటీ ఇంత బాగా నటించాడు అనిపించుకున్నాడు అని అతని తండ్ర, తాతల గురించి ఆరాలు తీశారు. అతను తప్ప ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అయినా ఇంత బాగా ఎలా నటించాడా అనుకున్నారు.

అందుకు కారణం.. అతను అంతకు ముందే అసిస్టెంట్ డైరెక్టర్. ఏ సీన్ కు ఏ ఎక్స్ ప్రెషన్ అయితే అచ్చంగా సరిపోతుందో అవగాహన ఉన్నవాడు. అసిస్టెంట్ గా ఉన్నప్పుడే అతనిలోనూ ‘యాక్టర్’ను చూసిన మొదటి దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అలా అష్టాచెమ్మా లాంటి సినిమాతో మొదలైన అతని ప్రస్థానం అతి తక్కువ సమయంలోనే ” సహజ నటుడు” అనే పెద్ద ట్యాగ్ వేసుకుంది.

ఆ నేచురల్ స్టార్ ఆ తర్వాత ఆల్ టాప్ స్టార్ ఫ్యామిలీస్ కీ ఫేవరెట్ హీరో అయ్యాడు. తెలుగు సినిమా రహదారిపై రైడ్ చేస్తూ.. తెలుగు హీరోల జట్టులో తనూ స్థానం సంపాదించిన అతను హీరోగా కెరీర్ ను అనుకోకుండా మొదలుపెట్టినా.. అలా మొదలైంది తర్వాత చాలా సీరియస్ గా సాగింది. వైవిధ్యమైన కథలు ఎంచుకున్నాడు. అప్పటికే నేచురల్ స్టార్ అన్న ట్యాగ్ వచ్చింది. అందుకు కారణం తను చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు.

తన కథలు కూడా అలాగే ఉండేలా చూసుకున్నాడు. ఆ సమయంలోని హీరోల్లా నేల విడిచి సాము చేయలేదు. కథలనే నమ్ముకుని ప్రయాణం సాగించాడు. దీనికి తోడు క్రమశిక్షణతో అడుగులు వేశాడు. అవే అతన్ని పరిశ్రమలోనూ అందరికీ మంచి మిత్రుడుగా మార్చాయి. ఆ క్రమశిక్షణ వల్లే ఒక దశలో వరుసగా ఫ్లాపులు వచ్చినా.. మళ్లీ నిలబడడం సాధ్యమైంది.


ఆ వెంటనే పిల్ల జమీందార్, ఈగ సినిమాలు స్టార్డమ్ కూడా తెచ్చాయి. ఈగలో కనిపించేది కొద్దిసేపే. కానీ ఆ ఈగలోనూ ఆడియన్స్ నానిని చూసుకున్నారు. ఆ కాసేపట్లోనే సినిమా అంతా కనిపించేంత ఇంపాక్ట్ వేశాడు. అదీ అతని యాక్టింగ్ కెపాసిటీ. ఈ కెపాసిటీతోనే స్టార్డమ్ ను కాపాడుకునేందుకు తనకంటూ ఓ కొత్త పాథ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈగ చిత్రానికి ‘టొరంటో ఆఫ్టర్ డార్క్ బెస్ట్ హీరో’ అవార్డ్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఎటో వెళ్లిపోయిందికి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ వచ్చింది.

అవార్డులు, రివార్డులతో కొనసాగుతున్న అతని కెరీర్ కు ఓ చిన్న బ్రేక్ పడింది. హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. అయినా వైవిధ్యాన్ని నమ్ముతూ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. కొన్నిసార్లు ఫ్లాపులు అవసరమే. అవే కదా పాఠాలు నేర్పిస్తాయి. నిజంగా ఈ హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత నాని కెరీర్ సరికొత్త కథలతో దూసుకుపోయింది.

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మన్, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఇలా వరుస విజయాలతో “హిట్ మెషీన్” అనిపించుకున్నాడు. జెర్సీలో అతని నటనకు కదిలిపోని వారు లేరు. అతనిలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో తెలిపే మరో సినిమా ఇది.


ఈ మధ్య కాలంలో తన కెరీర్ లో మరో ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాడు. కాస్త మాస్ టచ్ ఉన్న కథలూ ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో చేసిన వి, టక్ జగదీష్ ఆకట్టుకోలేదు. బట్ శ్యామ్ సింగరాయ్ తో సాధించాడు. తర్వాత అంటే సుందారానికి అంటూ తన ఇమేజ్ కు తగ్గ కథతో ఆకట్టుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన దసరాలో నానిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంత ఊరమాస్ గెటప్ లో అతను కనిపించడం అదే ప్రథమం. అంటే సాహసం చేశాడు. ఆ సాహాసానికి బాక్సాఫీస్ సాహో అన్నది. వంద కోట్లు కట్టబెట్టింది. ప్రస్తుతం హాయ్ నాన్నాఅనే సినిమాతో ఈ యేడాది డిసెంబర్ లో రాబోతున్నాడు.


మరోవైపు నిర్మాతగానూ మెప్పిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి అ, హిట్, హిట్2 అంటూ నిర్మాతగానూ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. నాని ఎంచుకునే కథలే వైవిధ్యంగా ఉంటాయి. అవన్నీ సక్సెస్ సూత్రాల్లా కనిపిస్తాయి. ఆ సక్సెస్ సూత్రం పట్టుకునేందుకు సమకాలీన హీరోలు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. మధ్యలో ఒకటీ అరా ఫ్లాపులున్నా.. అతని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయిన దాఖలాలు అత్యంత తక్కువ.

పైగా ఓవర్శీస్ లో స్టార్ హీరోలకు ధీటైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ దశలో తెలుగులో టాప్ హీరోలు అనిపించుకున్నవాళ్లు.. ఓవర్శీస్ లో నానిని బీట్ చేయడానికి ఏళ్ల తరబడి ఎదురుచూశారు. అదీ అతని దమ్ము. ఎలా చూసినా పదిహేనేళ్లలో నాని తన కెరీర్ ను నిర్మించుకున్న విధానం ఓ గొప్ప ఆదర్శవంతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా.. ఎక్కువగా విజయాలే చూశాడు.. చూస్తున్నాడు. మరి ఈ 15యేళ్లే కాదు.. రాబోయే 30యేళ్లూ ఇలాగే మోస్ట్ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించాలని తెలుగు70ఎమ్ఎమ్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Related Posts