”గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్”.. సంచలనంగా సజ్జనార్ ట్వీట్

ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఏర్పడ్డ స్పెషల్ ఇంటెలిజెంట్ బ్యూరో ఎస్ఐబీకిగతంలో ఐజీగా పనిచేశారు. అనేక ఎన్‌కౌంటర్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి మావోయిస్టు సానుభూతిపరుడు, విప్లవ వాది అయిన గద్దర్‌కి చాలా దగ్గర వ్యక్తి కావటం ఆసక్తిరేపుతోంది. గద్దర్ అంటే తనకు అభిమానమని గద్దర్ పాటలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు.


“గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. పాట అంట చెవులతో వినేది కాదు.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది.. పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలు ఎక్కుపెట్టి అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్థం చెప్పేవారు గద్దర్.” ఇదీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ చేసిన ట్వీట్ అంటే నమ్మేలా ఉందా.. కానీ ఇది నిజం. ఈ మాటలు చెప్పింది సజ్జనార్.

ఒకప్పుడు గద్దర్ భావజాలాన్ని అణచివేయడానికే తుపాకీ పట్టిన సజ్జనార్ ఇప్పుడు ఆ ఉద్యమాల గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కాదు.. షాక్. గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి ఆయన గురించిన జ్ఞాపకాలను పంచుకున్నాడు.” గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాల్లో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు. గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార “అన్నా” అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Related Posts