సామజవరగమనా ..

హీరోగా శ్రీ విష్ణు ఇమేజ్ గురించి అందరికీ తెలుసు. వైవిధ్యమైన కథలు సెలెక్ట్ చేసుకుంటాడు. అతని కథల ఎంపికలోఅందరినీ అలరించే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ తరహా హీరోలుఇండస్ట్రీలో ఇంకా ఉన్నారు. వీరంతా ఒక ఇమేజ్ రాగానే మాస్ స్టోరీస్ అంటూ వెళతారు. అవి వారి ఇమేజ్ కు స్టేచర్ కు సెట్ కావు. కట్ చేస్తే ఫ్లాపులు తప్పవు. అలా వరుస ఫ్లాపులు ఇచ్చి కనుమరుగైన హీరోలు చాలామందే ఉన్నారు.

బట్ శ్రీ విష్ణు మరీ అలా కాదు కానీ.. అప్పుడప్పుడూ మాస్ రూట్ లోకి వెళ్లి చేతులు కాల్చుకోవడం.. తర్వాత మళ్లీ తన కంఫర్ట్ జోన్ అయిన ఎంటర్టైన్మెంట్ లోకి రావడం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సామజవరగమనా అనే మూవీతో వచ్చాడు. ఈ సినిమాకు రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ప్రీమియర్స్ వల్ల అతని సినిమాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. సినిమా హిలేరియస్ గా ఉండటంతో ప్రీమియర్స్ చూసిన వాళ్లు రిలీజ్ కు ముందే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.


నిజంగానే సినిమా చాలా బావుంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని తెలుగు సినిమాల్లోనూ బాగా చదువుకోని కొడుకులను తండ్రులు తిట్టడం చూశాం. బట్ ఈ మూవీలో రివర్స్ లో వెళ్లాడు దర్శకుడు. తన తండ్రి డిగ్రీ పాస్ అయితేనే తాతల ఆస్తి వస్తుంది. అందుకోసం తండ్రిని డిగ్రీ పాస్ చేయించే బాధ్యత తీసుకుని అతను చదవకపోయినా.. పాస్ కాకపోయినా అదే పనిగా తిడుతూ ఉంటే ఆడియన్స్ కు అద్బుతమైన వినోదం అందింది.

ఇదే క్రమంలో హీరోకూ ఓ ఇష్యూ పెట్టాడు. తనకు ఫస్ట్ లవర్ రాఖీ కట్టిందని.. ఎవరినీ ప్రేమించకుండా.. తనను ఎవరైనా ప్రేమిస్తే వారితో రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు. ఇక తన తండ్రిని పాస్ చేయించడం కోసం ఓ అమ్మాయిని ట్యూటర్ గా తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. చివరికి ఆమెతో ప్రేమలో పడతాడు. తీరా పెళ్లి వరకూ వెళితే.. ఆమెకూ ఓ సమస్య ఉంటుంది. అయితే ఇవన్నీ సీరియస్ గా కాక హిలేరియస్ గా ఉంటాయి. అదే ఈ సామజవరగమన విజయానికి కారణం. సెకండ్ హాఫ్‌ లో కథ కాస్త నెమ్మదించింది అనుకున్నా.. వెన్నెల కిశోర్ ట్రాక్ తో మళ్లీ నవ్వులు పూయించారు.


సామజవరగమనా.. ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే. కానీ కథనంతో మెప్పించారు. మాటలతో నవ్వించారు. క్లీన్ కామెడీగా అదరగొట్టారు. అందుకే ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. ఇక శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇరగదీశాడు. అతనితో పాటు నరేష్‌, హీరోయిన్ రెబా మోనిక, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్.. అందరూ ఇరగదీశారు అనే చెప్పాలి. అందుకే సామజవరగమనా ఈ వీకెండ్ కు బెస్ట్ ఆప్షన్ గా మారింది.


ఈ సినిమాకు ప్రధాన బలం రచన. దర్శకత్వం. ఈ రెండు అంశాలూ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావడంతో ఓ సాధారణ కథ కూడా అసాధారణంగా ఎంటర్టైన్ చేస్తుందని మరోసారి ప్రూవ్ చేసింది సామజవరగమనా..
సో శ్రీ విష్ణకు బలం ఇదే. ఎంటర్టైన్మెంట్. ఇది దాటి చేసిన ప్రయత్నాలేవీ అతనికి విజయాన్ని ఇవ్వలేదు. అలాగని కెరీర్ అంతా ఈ సినిమాలే చేసినా మొనాటనీ వస్తుంది. సో.. కథ ఏదైనా అందులో వినోదం కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా కెరీర్ సక్సెస్ ట్రాక్ పైనే పరుగులు పెడుతుంది.

Related Posts