తినడానికి దొరికిన తర్వాత ఆకలిని మర్చిపోయావ్ సూరి

తెలుగులో వెబ్ సిరీస్ లు తక్కువ. వచ్చినా ఆకట్టుకున్నవి మరీ తక్కువ. ఆ తక్కులో ఖచ్చితంగా ఉండేది లూజర్ వెబ్ సిరీస్. రెండేళ్ల క్రితం జి5లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ కు మంచి పేరొచ్చింది. నలుగురు మనుషుల కోరికలు, ఆశలు, లక్ష్యాలు, వారి సంఘర్షణలు గెలిచే సత్తా ఉన్నా.. సరైన పరిస్థితులు లేక ఇబ్బంది పడ్డ అంశాల సమాహారంగా వచ్చిన ఈ సిరీస్ చాలామందిలో స్ఫూర్తిని నింపింది కూడా. ప్రధాన పాత్రల్లో ప్రియదర్శి, అనీ, శశాంక్, కల్పిక, పావనిరెడ్డి వంటి వారు నటించారు. అందరూ అప్పుడు నటనలో తమ బెస్ట్ ను ఇచ్చారు. మొదటి భాగంలో వారి ఓటమిని చూసిన వారికి తర్వాత వారి లైఫ్ లో వచ్చిన మార్పులతో మరో సిరీస్ రెడీ అయింది. లేటెస్ట్ గా లూజర్2 ట్రైలర్ రిలీజ్ అయింది.
మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఇదీ రూపొందినట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. క్రికెటర్ కాలేకపోయిన శశాంక్ తన కొడుకును ఆ దిశగా ప్రోత్సహించడం.. బ్యాడ్మింటన్ ప్లేయర్ కాలేకపోయిన రూబీ తన కట్టుబాట్లను కాదని కొత్త తరానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయడం.. వంటి అంశాలతో కొనసాగింపు బాగా కుదిరినట్టు కనిపిస్తోంది. అయితే సిరీస్ లో కాస్త ఎక్కువ పేరూ, ఫేమ్ ఉన్న ప్రియదర్శి పాత్రను కొత్తగా మలిచినట్టున్నారు. మొదట్లో పెయింటింగ్ పని చేస్తూ షూటింగ్ నేర్చుకుంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న సూరి అనే ఆ పాత్రకు ఈ సారి మరింత గుర్తింపు వస్తుంది. దాన్ని కమర్శియల్ గా వాడుతూ.. కాన్ సెంట్రేషన్ తగ్గిస్తాడు. దీంతో దేశానికి పతకం తెస్తాడు అనుకున్నవాడు కాస్తా.. అసలు ప్రాతినిధ్యాన్నే కోల్పోయే పరిస్థతికి వస్తాడు. ఈ క్రమంలో ట్రైలర్ చివరలో వచ్చిన డైలాగ్.. ‘తినడానికి తిండి దొరికిన తర్వాత నువ్వు ఆకలిని మర్చిపోయావ్ సూరీ’అనేది.
ఈ డైలాగ్ లో ఆకలి అంటే గెలవాలన్న కసి.. చిన్న గుర్తింపు రాగానే ఆతను ఆ కసిని మర్చిపోయాడనే దానికి సింబాలిక్ గా వాడిన ఈ పదం ఇందులోని అన్ని పాత్రలకూ వర్తించేలా కనిపిస్తోంది. అంటే దర్శక ద్వయం అభిలాష్ రెడ్డి, శ్రావణ్ మాదాల ఈ సారి కూడా బాగా రాసుకున్నారనే అనుకోవాలి. ఈ నెల 21నుంచి జి5లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Posts