‘సత్యభామ‘ రివ్యూ

నటీనటులు: కాజల్‌, నవీన్‌ చంద్ర, ప్రకాష్ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ తదితరులు
సినిమాటోగ్రఫి: విష్ణు బెసి
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
ఎడిటింగ్‌: కోదాటి పవన్‌కల్యాణ్‌
నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాస్‌ తక్కలపెల్లి
దర్శకత్వం: సుమన్‌ చిక్కాల
విడుదల తేది: 07-06-2024

తెలుగులో మళ్లీ సినిమాల సందడి మొదలయ్యింది. వారం వారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈకోవలో ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాలలో ‘సత్యభామ‘ ఒకటి. ఇప్పటివరకూ గ్లామరస్ రోల్స్ లో మురిపించిన అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ‘. ‘గూఢచారి, మేజర్’ వంటి మూవీస్ లో తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. ఈ మూవీకి స్క్రీన్ ప్లే సమకూరుస్తూనే.. ప్రెజెంటర్ గా వ్యవహరించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సత్యభామ‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
షీ టీమ్ డిపార్ట్ మెంట్ లో ఏసీపీగా పనిచేస్తుంది సత్య అలియాస్ సత్యభామ (కాజల్). మహిళలను ఇబ్బంది పెట్టేవారిని మఫ్టీలో వెళ్లి మరీ చితక బాదుతోంది సత్య. అలాగే.. షీ సేఫ్‌ యాప్‌ ద్వారా మహిళలకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. సత్యభామ ఉందనే నమ్మకం కలిగిస్తుంది. అదే సమయంలో గృహ హింసని అనుభ‌విస్తూ హ‌సీనా (నేహా పఠాన్) అనే బాధితురాలు సాయం కోసం సత్యభామ దగ్గరికి వ‌స్తుంది. సత్యభామ ఆమెకు అభయం ఇచ్చినా.. భర్త చేతిలో హసీనా దారుణ హత్యకు గురవుతుంది. తన కళ్ళ ముందే చనిపోయిన హసీనా.. తన తమ్ముడు ఇక్బాల్(ప్రజ్వల్) ని చూసుకోమని సత్య కి చెబుతోంది.

అయితే.. హసీనా తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్) మిస్ అవ్వడంతో సత్యభామ ఆ కేసు టేకప్ చేస్తుంది. దీంట్లో ఓ ఎంపీ తనయుడు రిషి(అంకిత్)కి సంబంధం ఉందని తెలుస్తుంది. అసలు ఇక్బాల్ ఏమయ్యాడు? రిషి పాత్రేంటి? సత్యభామ వృత్తి జీవితానికి భర్త అమర్ (నవీన్ చంద్ర) అందించిన సహకారం? ఈ అన్ని విషయాలు తెలియాలంటే ‘సత్యభామ‘ చూడాల్సిందే.

విశ్లేషణ
టాలీవుడ్ లో లాంగ్ కెరీర్ ఉన్న కథానాయికల్లో కాజల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. రెండు తరాల కథానాయకులకు కథానాయికగా నటించిన క్రెడిట్ కాజల్ అగర్వాల్ ది. అయితే.. ఇప్పటివరకూ కమర్షియల్ మూవీస్ లో హీరోయిన్ గా మాత్రమే మెరిసిన కాజల్.. లేడీ ఓరియెంటెడ్ గా నటించిన సినిమా ఇది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కాజల్ మేకోవర్ బాగుంది. ఒక పోలీస్ రోల్ కి కావాల్సిన సీరియస్ నెస్ ఆ పాత్రలో కనిపించింది. అలాగే.. ఒక మహిళగా మిగతా మహిళల కష్టాలను అర్థం చేసుకునే ఎమోషన్స్ ను ఆన్ స్క్రీన్ పై అందంగా పండించింది కాజల్.

సత్యభామ పాత్ర ఎలా ఉంటుందో సినిమా మొదట్లోనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. పోలీస్ రోల్ లో ఆమె ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుంది? అని తెలియజేయడానికి ఎంట్రీ సీన్ అదరగొట్టేలా తీర్చిదిద్దాడు. అయితే.. హసీనాను చంపిన యదుని, మిస్ అయిన ఇక్బాల్ ని వెతికే ప్రయత్నంలో ‘సత్యభామ‘ కథలో కొత్త యాంగిల్స్ ను చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ సుమన్ చిక్కాల. ఉమెన్ ట్రాఫికింగ్, గేమింగ్, టెర్రరిజం, మెడికల్.. ఇలా రకరకాల పాయింట్స్ నుంచి తీసుకెళ్లిన ఈ కథ కొన్నిసార్లు కన్ఫ్యూజన్ గానూ మారుతుంది. ఇక.. షీ సేఫ్‌ యాప్‌ ప్రాధాన్యత గురించే చెప్పే సన్నివేశాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.

శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే మ్యాజిక్ ప్రేక్షకుడి మెదడుకు పదును పెట్టేలా ఉంది. సినిమా ఆద్యంతం తర్వాత ఏం జరుగుతోంది? అనే క్యూరియాసిటీ పెంచడంలో కొంతవరకూ శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే పనిచేసిందని చెప్పొచ్చు. కానీ.. సినిమా చూస్తుంటే కథను ఇంకాస్త బలంగా రాసుకొని, ఇంకాస్త ఆసక్తికరంగా తెరకెక్కించి ఉండాల్సింది అనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇప్పటివరకూ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లోనే మురిపించిన కాజల్ అగర్వాల్.. పోలీస్ రోల్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యింది. ‘సత్యభామ‘గా టైటిల్ రోల్ లో సరిగ్గా సరిపోయింది. యాక్షన్ లోనూ కాజల్ కష్టం కనిపిస్తుంది. ఫుల్ లెన్త్ లో కాకపోయినా.. కనిపించినంత సేపు నవీన్ చంద్ర తన పాత్ర పరిధిమేరకు నటించాడు. ఇక్బాల్ గా కనిపించిన ప్రజ్వల్ నటన ఇంప్రెస్ చేస్తుంది. ఇతర పాత్రల్లో కనిపించిన ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్, నాగినీడు పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ కి సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి విభాగాలు ఎంతో కీలకం. టెక్నికల్ ఫ్రంట్ లో ‘సత్యభామ‘ బాగుంది. అయితే.. ఆసక్తికర కథ, కథనాలు కొరవడడంతో సినిమా అనుకున్న స్థాయిలో లేదనే భావన కలుగుతుంది.

చివరగా
మొత్తంగా.. పోలీసాఫీసర్ పాత్రలో కాజల్ పవర్ చూడాలనుకునే వారికి ‘సత్యభామ‘ నచ్చే అవకాశం ఉంది. అయితే.. అంచనాలను అందుకోవడంలో మాత్రం ‘సత్యభామ‘ పూర్తిస్థాయిలో సఫలమవుతోందా? లేదా? అనేది ప్రేక్షకులే నిర్ణయించాలి.

రేటింగ్:2.75/ 5

Related Posts