వైజయంతీ ఇచ్చిన వార్నింగ్ ఎవరికి?

మెగాస్టార్ చిరంజీవి మెగా హిట్స్ లో ముందు వరుసలో నిలిచే చిత్రం ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘. ఈ సోషియో ఫాంటసీలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే జగదేకవీరుడు గా చిరంజీవి.. అతిలోకసుందరి గా శ్రీదేవి నటన అమోఘం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభకు.. వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మాణ దక్షతకు అద్దం పట్టే చిత్రమిది. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ ఎక్కడో ఓ చోట మారుమ్రోగుతూనే ఉంటాయి. 1990, మే 9న విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు అశ్వనీదత్. సీక్వెల్ లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి తనయ జాన్వీ నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సైతం వెల్లిబుచ్చారు. అయితే తాజాగా ఈ సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫమేషన్ ఇవ్వలేదు కానీ.. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ సినిమాకి సంబంధించి ఓ పబ్లిక్ నోటీస్ ను తమ ట్విట్టర్ ఖాతా నుంచి విడుదల చేసింది వైజయంతీ మూవీస్ సంస్థ.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ సినిమాలోని స్టోరీ, కాన్సెప్ట్, క్యారెక్టర్స్ ను తమ ప్రమేయం లేకుండా ఉపయోగించడానికి వీల్లేదని.. ఒకవేళ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవనేది.. ఆ నోటీసు సారాంశం. అయితే ఆల్ ఆఫ్ సడెన్ గా వైజయంతీ మూవీస్ ఈ నోటీసు ఇవ్వడం వెనుక కారణం ఏంటని ఆరాతీస్తున్నారు నెటిజన్స్. మరోవైపు చిరంజీవితో యంగ్ డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించబోయే సినిమా కూడా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి‘ లైన్ తో సాగుతుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ ముల్లోక వీరుడు గా కనిపించబోతున్నాడని వినిపించింది. ఈనేపథ్యంలోనే.. వైజయంతీ మూవీస్ ఈ పబ్లిక్ నోటీస్ ను రిలీజ్ చేసిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related Posts