కళ్యాణ్ రామ్ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి

లేడీ అమితాబ్‌, లేడీ సూప‌ర్ స్టార్ గా హీరోయిన్స్ కు స్పెష‌ల్ క్రేజ్ తీసుకొచ్చిన నటీమణి విజ‌య‌శాంతి. ఒకవైపు గ్లామర్ రోల్స్ లో మురిపిస్తూనే.. త‌న‌దైన న‌ట‌న‌తో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది విజయశాంతి. అప్ప‌టి సీనియ‌ర్ హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ సినిమాల్లోనూ, విప్లవాత్మ‌క చిత్రాల్లో న‌టించి మెప్పించిన ఘనత విజయశాంతిది.

40 సంవత్సరాల సినీ కెరీర్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో విజయాలందుకుంది. వివిధ భాషలలో మొత్తంగా 187 చిత్రాలలో నటించిన విజయశాంతికి.. 1990లో వచ్చిన ‘కర్తవ్యం’ చిత్రంలోని నటనకు గానూ.. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

చాలా కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి.. మ‌హేష్ బాబు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన భార‌తి పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. ఆ తర్వాత చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషించనుందనే ప్రచారం జరిగినా.. అవన్నీ రూమర్సేనని కొట్టి పారేసింది విజయశాంతి.

ఈరోజు (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు. ఈ సందర్భంగా.. విజయశాంతి నటిస్తున్న కొత్త సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ నటిస్తున్న 21వ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతుంది.

నటరత్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ 21వ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘కాంతార, విరూపాక్ష’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో విజయశాంతి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతుంది.

Related Posts