పవన్ కళ్యాణ్ సినిమాలకోసం ప్రణాళిక సిద్ధం

అతను పవన్ కాదు.. తుఫాన్ అంటూ రాజకీయాల్లో పవర్ స్టార్ దూకుడు గురించి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే చెప్పారు. ఇప్పటికే పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ సృష్టించిన ప్రకంపనలు చూశాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా మునుముందు రాజకీయంగా ఆయన పాత్ర నిర్దేశం అయిపోయింది. దీంతో.. పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాల పరిస్థితి ఏంటి? అనేదే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

అయితే.. తన సినిమాల విషయంలో పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం పూర్తిచేయాల్సిన మూడు సినిమాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే.. ‘హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాతలను కలిసి.. తన కాల్షీట్స్ ను సర్దుబాటు చేసే విషయంపై చర్చించనున్నాడట.

ఇక.. పవన్ నటిస్తున్న చిత్రాలలో ‘ఓజీ’ చాలా వరకూ పూర్తయ్యింది. ఈ సినిమాకోసం పవన్ కేవలం రెండు, మూడు వారాల పాటు డేట్స్ ఇస్తే సరిపోతుందట. అసలు ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అయితే.. ఆ తేదీకి ‘ఓజీ’ రావడం కష్టమేనట. మరో చిత్రం ‘హరిహర వీరమల్లు’ కూడా దాదాపు పూర్తయినట్టే. రెండు భాగాలుగా ఈ సినిమాని తీసుకురాబోతుండడంతో.. ఈ చిత్రంలోని మొదటి భాగం కోసం పవన్ కేవలం కొన్ని రోజుల పాటు డేట్స్ ఇస్తే సరిపోతుందట.

‘ఓజీ, హరిహర వీరమల్లు’లతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను కూడా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతోనే ఉన్నాడట పవన్. ఆ తర్వాత మాత్రం కొత్త సినిమాలకు దూరంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ అట.

Related Posts