నవీన్ పోలిశెట్టి ఒంటరి పోరాటం

సినిమా పరిశ్రమ అంటేనే విపరీతమైన పోటీ ఉంటుంది. ఈ పోటీలో నిలబడాలంటే తమ సినిమాపై ఆడియన్స్ లో ఓ క్రేజ్ ను తీసుకురావాలి. విడుదలకు ముందు ప్రామిసింగ్ అనే ఫ్లేవర్ కనిపించేలా ప్రమోషన్స్ చేయాలి. అందుకే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఒకరిని మించి ఒకరు ప్రయత్నాలు చేస్తుంటారు. మూవీ టీమ్ అంతా కలిసి సందడి చేస్తుంది. కొన్నిసార్లు రిలీజ్ కు ముందే టూర్స్ వేస్తుంటారు. ఇంకొందరు టాక్ తెలిసిన తర్వాత టూర్స్ అంటుంటారు. మరికొందరు కాలేజ్ లకు వెళతారు. పబ్లిక్ లో రకరకాలుగా సందడి చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం ప్రధానంగా కనిపించేది.. కనిపించాల్సింది హీరో, హీరోయిన్, దర్శకుడు. వీరితో పాటు ఇంకా క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు కూడా ఉంటే వారూ ప్లస్ అవుతారు. బట్ ఈ విషయంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీమ్ పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తోంది.


అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా ఇది. సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చాలా ఆలస్యం అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మరో ప్యాన్ ఇండియన్ మూవీ జవాన్ తో పోటీగా వస్తున్నారు వీళ్లు. అంటే ప్రమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి..? కానీ ఈ చిత్ర ప్రమోషన్స్ కు అనుష్క రావడం లేదు. కేవలం నవీన్ పోలిశెట్టి మాత్రమే ఊర్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అతను ఎంత ప్రమోషన్ చేసినా అనుష్క కనిపిస్తే చాలు అనేదే పెద్ద పాయింట్.

నిజం.. అనుష్క కూడా ప్రమోషన్స్ లో ఉంటే ఈ సినిమాకు ఎంత హైప్ వస్తుందో అంచనా వేయడం. కానీ తను రావడం లేదు. అసలుకే రానందా ఇప్పటికీ రాను అందా అనేది తెలియదు కానీ.. పాపం నవీన్ పోలిశెట్టి మాత్రం తెగ తిరుగుతున్నాడు. రోజుకో ఊర్లో సందడి చేస్తున్నాడు. ఒక పెద్ద సినిమాకు పోటీగా వస్తూ.. మరో పెద్ద సినిమాకు ఖుషీ విడుదల తర్వాత రిలీజ్ పెట్టుకున్నప్పుడు ఈ డోస్ సరిపోదు.

నవీన్ మాటకారే. కానీ ఓపెనింగ్స్ తెచ్చేంత సత్తా అతని మాటల్లో ఉందా అనేది అనుమానమే. ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు మాత్రమే నవీన్ ఖాతాలో ఉన్న హిట్స్. ఈ రెండు సినిమాలతోనే మరో సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చేంత క్రేజ్ ఉందా అంటే లేదు అనే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అతని మాటకారి తనం అప్పటి వరకూ ఎంగేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేసినా.. అక్కడి నుంచి టికెట్ కౌంటర్ వరకూ తేవడం అనుకున్నంత సులువైతే కాదు.


ఏదేమైనా అతను మాత్రం తన సినిమా కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. చాలా అంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. కనీసం అనుష్కతో ఇన్ హౌస్ ప్రమోషన్స్ అయినా చేయించి విడుదల చేస్తే బెటర్ అవుతుంది. లేదంటే ఈ మిస్ అండ్ మిస్టర్ శెట్టికి బాక్సాఫీస్ దగ్గర గట్టి దెబ్బే పడుతుందంటున్నారు విశ్లేషకులు.

Related Posts