మహేష్ బాబు కెరీర్ కి 44 ఏళ్లు

బాల నటులుగా ప్రవేశించి హీరోలుగా దుమ్మురేపిన వాళ్లలో నటసింహం బాలకృష్ణ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నిలుస్తాడు. చిన్నప్పుడే డ్యాన్సులు, ఫైట్స్ లో ఇరగదీసిన మహేష్.. డ్యూయల్ రోల్ తోనూ మురిపించిన సందర్భాలున్నాయి. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో చిన్నతనంలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక.. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి నేటితో (నవంబర్ 29) 44 ఏళ్లు పూర్తవుతున్నాయి. మహేష్ తొలి చిత్రం ‘నీడ‘ నవంబర్ 29, 1979న విడుదలైంది. అప్పటికి మహేష్ వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

‘నీడ‘ సినిమా తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘పోరాటం‘ సినిమా చేశాడు ప్రిన్స్. ఆ తర్వాత ‘శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు‘ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టేశాడు. ప్రస్తుతం ‘44 ఇయర్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‘ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది.