కీడా కోలా టీజర్ ఎలా ఉంది..

టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ లేటెస్ట్ మూవీ కీడా కోలా. దర్శకుడుగా మొదటి సినిమా పెళ్లి చూపులుతో ఓవర్ నైట్ ఫేమ్అయిన తరుణ్‌ భాస్కర్ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన ఈ నగరానికి ఏమైంది మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. కమర్షియల్ గానూ విజయం సాధించింది. అయితే థర్డ్ మూవీ విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది. మూడో సినిమాను వెంకటేష్‌ తో చేయాలనే ప్లాన్ చేసుకున్నారు. కానీ కథ కరెక్ట్ గా కుదర్లేదు. పెళ్లి చూపులు టైమ్ లోనే సురేష్‌ ప్రొడక్షన్స్ లో మూడు సినిమాలకు ఒప్పందం రాశాడు. దానికోసమే అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. వెంకీతో సినిమా ఇప్పట్లో అయ్యేలా లేదని ఈ కీడా కోలా మొదలుపెట్టారు.


తాజాగా కీడాకోలా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే తరుణ్‌ భాస్కర్ స్టైల్ లోనే ఉంది. పర్టిక్యులర్ గా ఇతను హీరో, ఇతను విలన్ అనే పాయింట్స్ ఏం కనిపించడం లేదు. ఓ పెద్ద గ్యాంగ్. ఆ గ్యాంగ్స్ మధ్య వార్స్. వీరికి కామన్ గా ఓ కీడా కోలా సీసా. ఈ సీసాలో ఉన్నదానికోసమే ఈ గ్యాంగ్ వార్ జరుగుతుంది అనేలా ఉంది టీజర్. ప్రధానంగా బ్రహ్మానందం, చైతన్య రావు, జీవన్ తో పాటు తరుణ్‌ భాస్కర్ కూడా కీలకంగా కనిపిస్తున్నారు. హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఏం చూపించలేదు. ఈ మధ్య కాలంలోవరుసగా పరిచయం చేసిన పాత్రల్లో కూడా ఫీమేల్ లీడ్ కు అంత ప్రాధాన్యం కనిపించలేదు.


తరుణ్‌ భాస్కర్ సినిమాల్లోని పాత్రలకు కాస్త టిపికల్ గా ఉంటాయి. యూత్ టార్గెట్ గా కనిపిస్తాయి. ఈ సారి కాస్త భిన్నంగా కనిపిస్తుంది. అయితే కథగా మాత్రం ప్రత్యేకత ఉన్నట్టు ఈ టీజర్ లో కనిపించడం లేదు. ఈ తరహా చేజింగ్ కామెడీ గ్యాంగ్ వార్ సినిమాలు తెలుగులో ఇవివి సత్యనారాయణ, రామ్ గోపాల్ వర్మ, ఎస్వీ కృష్ణారెడ్డి, రేలంగి నర్సింహారావు వంటి దర్శకులు ఎప్పుడో టచ్ చేశారు. అయినా తరుణ్‌ భాస్కర్ పాత్రలు వేరే ఉంటాయి కాబట్టి.. ఈ తరం ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రూపొందించి ఉండొచ్చు. బట్ టీజర్ లో మాత్రం ఏ ప్రత్యేకతా కనిపించడం లేదు అనే చెప్పాలి.

Related Posts