జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్‘ రీ-రిలీజ్ ఆదాయం

మెగా బ్రదర్ నాగబాబు.. తన మెగా ఫ్యామిలీ హీరోలతో మెగా మూవీస్ చేసినా.. నిర్మాతగా పెద్ద విజయాలు అందుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో ‘ఆరెంజ్‘ సినిమాతో సర్వం కోల్పోయాడు. అయినా.. మళ్లీ ఆత్మవిశ్వాసంతో బుల్లితెర, వెండితెరపై నటుడిగా బిజీ అయ్యాడు.


ప్రస్తుతం తన తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈమధ్య పాత సినిమాలను రీ-రిలీజ్ చేసే సంప్రదాయం టాలీవుడ్ లో బాగా పెరిగింది. ఈకోవలోనే తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రాలను వరుసపెట్టి రీ-రిలీజ్ చేశాడు. అలా వచ్చిన ఆదాయంలో సింహభాగాన్ని జనసేన పార్టీకే అందిస్తున్నాడు.

తొలుత తనను ఆర్థికంగా కృంగదీసిన ‘ఆరెంజ్‘ సినిమాని నాగబాబు రీ-రిలీజ్ చేస్తే.. మెగా ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. అలా వచ్చిన రూ.1.05 కోట్లు ఆదాయాన్ని జనసేన పార్టీకి ఇచ్చాడు. ఇక.. గీతా ఆర్ట్స్ లో వచ్చిన ‘జల్సా‘ సినిమా రీ-రిలీజ్ ద్వారా వచ్చిన కోటి రూపాయలను కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ గా సెప్టెంబర్ లో రీ-రిలీజ్ అయిన ‘గుడుంబా శంకర్‘ ద్వారా వచ్చిన ఆదాయంలో సింహభాగం రూ. 35 లక్షలు తాజాగా జనసేన పార్టీకి అందజేశాడు నాగబాబు.

Related Posts