నా కోసం అల్లు అర్జున్ వస్తాడు

స్టార్ కాంపెయిన్ అనేది ఏ రంగంలో అయినా అట్రాక్టివ్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల్లో స్టార్స్ ప్రచారం చేస్తే ఆ గ్లామర్ వేరే ఉంటుంది.ఇక తమ ఫ్యామిలీ మెంబర్సే ఎన్నికల్లో నిలబడితే స్టార్స్ మాత్రం ఆగుతారా.. అందుకే తన కోసం తన అల్లుడు ఎన్నికల ప్రచారానికి వస్తాడు అంటున్నాడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.

చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆ నియోజకవర్గం నుంచే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ క్రమంలో చాలాకాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాడు. అయితే అతను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు.. ఏ పార్టీ టికెట్ ఇస్తుందన్న క్లారిటీ మాత్రం లేదు. మామూలుగా అధికార పార్టీ నుంచే టికెట్ ఆశిస్తారు.ఈ మేరకు ఆయనకు ఒక హామీ వచ్చిందా లేదా అనేది తెలియదు. ఇతర పార్టీలు అంటే అది కూడా ఇంకా తెలియడం లేదు.


రీసెంట్ గా చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ వద్ద ఓ కన్వెన్షనల్ హాల్ నిర్మించాడు. దాని ఇనాగరేషన్ కు అల్లు అర్జున్ వెళ్లాడు. ఈ సందర్భంగా ఈ ఐకన్ స్టార్ కు నియోజకవర్గ స్థాయిలో భారీ ఆహ్వానం అందింది. రోడ్ పొడువునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు. అయితే అభిమానుల కంటే చంద్రశేఖర్ రెడ్డే తన అనుచర వర్గంతో ఈ ఏర్పాట్లు చేయించి ఆయా పార్టీలకు తన బలం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు అనేవారూ లేకపోలేదు.

ఈ సందర్భంగా ఒకవేళ ఆయన ఎన్నికల్లో నిలబడితే ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ వస్తాడా అని ప్రశ్నిస్తే.. “ఎందుకు రాడు. ఖచ్చితంగా వస్తాడు. ఇంకా చెబితే నన్ను నియోజకవర్గం మొత్తం సర్వే చేసి ఫలితాలు తనకు చెప్పమని కూడా అన్నాడు.. ” అని బదులిచ్చాడు. దీన్ని బట్టి తన మామ ఎమ్మెల్యే కావాలని అల్లు అర్జున్ కూడా కోరుకుంటున్నట్టుగానే భావించాలి. అయితే ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు.. ఎవరు బి ఫారమ్ ఇస్తారు అనేదే పెద్ద ప్రశ్న.

Related Posts