సితార సంస్థ నుంచి వరుస సినిమాలు

హారిక అండ్ హాసినికి అనుబంధ సంస్థగా మొదలైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇప్పుడు తెలుగులో ఒన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్. చిన్న హీరోలు మొదలుకొని.. అగ్ర కథానాయకుల వరకూ వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. సితారకి తోడు త్రివిక్రమ్ కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం సితార నుంచి వస్తోన్న లైనప్ మామూలుగా లేదు.

‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో సూపర్ డూపర్ హిట్ ను తమ ఖాతాలో వేసుకుంది సితార సంస్థ. ఈ వేసవిలో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ఇదే హయ్యస్ట్ గ్రాసర్. ‘టిల్లు స్క్వేర్‘ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక.. సితార నుంచి ఈ మే నెలలో రాబోతుంది విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా అంజలి, నేహా శెట్టి నటించారు. మే 17న ఈ చిత్రం విడుదలకు ముస్తబవుతోంది.

సితార నుంచి రాబోతున్న పెద్ద చిత్రాలలో ‘ఎన్.బి.కె. 109’ ఒకటి. నటసింహం బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన స్పెషల్ గ్లింప్స్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ సినిమా టైటిల్, ఇందులో నటించే హీరోయిన్, విడుదల తేదీలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందట సితార ఎంటర్ టైన్ మెంట్స్.

తెలుగులో ‘మహానటి, సీతారామం‘ వంటి సినిమాలతో బడా హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్ తో ‘లక్కీ భాస్కర్‘ చిత్రాన్ని నిర్మిస్తోంది సితార. ఇప్పటికే పరభాషా నటుడు ధనుష్ తో ‘సార్‘ వంటి హిట్ అందుకున్న ఈ సంస్థ నుంచి రాబోతున్న క్రేజీ మూవీస్ లో ‘లక్కీ భాస్కర్‘ ఒకటి. ‘సార్‘ డైరెక్టర్ వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్‘ ను పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు.

సితార సంస్థ నుంచి రవితేజ సినిమా కూడా రాబోతుంది. రవితేజాతో డైరెక్టర్ భాను తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబో మూవీ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వడంతో ఈ మూవీని సైతం వీలైనంత తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సితార సిద్ధమవుతోంది.

సాయి దుర్గా తేజ్-సంపత్ నంది ‘గాంజా శంకర్’ కూడా సితారలో అనౌన్స్ అయ్యింది. ‘గాంజా శంకర్’ నుంచి స్పెషల్ గ్లింప్స్ కూడా వచ్చింది. అయితే.. ఈ సినిమా ప్రోగ్రెస్ కి సంబంధించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే.. ‘గాంజా శంకర్‘ ఆగిపోయిందనే ప్రచారం కూడా ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగానే సాగుతోంది.

ఇంకా.. సితార లో రూపొందుతోన్న ‘మ్యాడ్‘ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్‘ పట్టాలెక్కగా.. ‘టిల్లు‘ ఫ్రాంఛైస్ లో ‘టిల్లు క్యూబ్‘ కూడా రానున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చారు.

వీటితో పాటు.. యువ కథానాయకులైన ఆశిష్ రెడ్డి తో ఒక చిత్రం, అశోక్ గల్లాతో మరొకటి, నవీన్ పోలిశెట్టి హీరోగా ఇంకొకటి.. ఇలా మరికొన్ని సినిమాలు కూడా సితార నాగవంశీ లిస్ట్ లో ఉన్నాయి.

Related Posts