విశ్వక్ సేన్ విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్

టాప్ స్టార్స్ మినీ హీరోల సినిమాల్లో తళుక్కుమనడం కామన్ గానే చూస్తున్నాం. తెలుగులో ఇప్పుడిప్పుడే తనదైన ముద్ర వేస్తోన్న విశ్వక్ సేన్ నటిస్తోన్న ఓ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇద్దరి ఇమేజ్ ల పరంగా చూస్తే ఈ కాంబో క్రేజీగా ఉంటుంది. బట్ క్యారెక్టర్స్ ను బట్టి కదా ఇలాంటి పాత్రలకు కాల్షీట్స్ ఇచ్చేది. మరి వెంకీ చేస్తోన్న పాత్రేంటీ..? అంటే దేవుడి వేషం వేస్తున్నాడు.


రీసెంట్ గా అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ వరుస చిత్రాల్లో ఓ తమిళ్ రీమేక్ కూడా ఉంది. అక్కడ ఓ మై కడవులే పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కూ తమిళ్ లో చేసిన అశ్వత్ మారిముత్తునే దర్శకుడు. తెలుగులో ఓరి దేవుడా అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆ దేవుడు పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు. పాత్ర చిన్నదే. కానీ సినిమాను మలుపులు తిప్పుతూ వెళుతుంది. అందుకే వెంకీ ఓకే చెప్పాడు. ఇంతకు ముందు గోపాలా గోపాలా లో వెంకీ దేవుడిని నమ్మని వ్యక్తి పాత్రలో నటించాడు. ఇప్పుడు దేవుడయ్యాడు.


విశేషం ఏంటంటే.. ఈ పాత్ర నేరుగా ఉండదు. ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ లో సీన్స్ ఉండవు. కేవలం పై నుంచి వినోదం చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కేవలం బ్లూ మ్యాట్ లోనో లేక గ్రీన్ మ్యాట్ లోనో సింపుల్ గా కొట్టేయొచ్చు. ఆ కారణంగానే జస్ట్ మూడు రోజుల కాల్షీట్స్ తోనే వెంకీ రోల్ పూర్తవుతుందట. ఇదీ మంచిదే కదా అనుకుని ఉంటాడు.. మన నారప్ప. అందుకే వెంటనే యెస్ చెప్పేశాడు. మరి ఈ దేవుడేశం.. వెంకటేష్‌ కు ఎలాంటి గుర్తింపు తెస్తుందో.

Related Posts