ఊరమాస్ సినిమాతో వస్తోన్న క్లాస్ డైరెక్టర్ అండ్ హీరో

గౌతమ్ వాసుదేవ్ మీనన్.. ఈ పేరు వినగానే ఇండియన్ స్క్రీన్ మోస్ట్ స్టైలిస్డ్ మూవీస్ గుర్తొస్తాయి. చాలా పెద్ద దర్శకులు కూడా ఊహించని షాట్ డివిజన్ కనిపిస్తుంది అతని సినిమాలో. అది కూడా అత్యంత స్టైలిష్ గా. పోలీస్ సినిమాలంటే అరుపులు కేకలుగా ఉన్న టైమ్ లో కాక్క కాక్క(తెలుగులో ఘర్షణ)తో ఒక్కసారిగా మార్చేశాడు. ఈ మూవీ అక్కడ బిగ్గెస్ట్ హిట్. అతను ఏ హీరోతో సినిమాలు చేసినా అతనితో పాటు హీరోయిన్ కూడా బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ నుంచి మేకింగ్ వరకూ స్టైలిష్ గానే ఉండేలా చూసుకోవడం గౌతమ్ స్టైల్. చివరికి కమల్ హాసన్ తో చేసిన రాఘవన్ కూడా ఈ తరహాలోనే ఉంటుంది. ఇక ఈ మధ్య అతని సినిమాలు పెద్దగా ఆడటం లేదు ఇదే టైమ్ లో నటుడుగానూ బిజీ అయ్యాడు. అలాంటి తను ఇప్పుడు శింబుతో ‘వెందు తనింధతు కాడు’(మండుతోన్న అడవి) అనే సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ గౌతమ్ తో పాటు శింబు ఫ్యాన్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది.
గతంలో గౌతమ్ – శింబు కాంబోలో విన్నితాండై వరువాయ(తెలుగులో ఏ మాయ చేశావె),అచ్చం యెన్బదు మడమైదా (తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో) సినిమాలు వచ్చాయి. ఈ రెండూ స్టైలిష్ గా ఉంటాయి. అలాంటిది హ్యాట్రిక్ మూవీగా వస్తోన్న వెందు తనింధతు కాడు మాత్రం ఊరమాస్ గా కనిపిస్తోంది. శింబు పాత్ర ఓ చిన్న గ్రామం నుంచి పట్టణానికి వెళుతుంది. అక్కడ అనుకోకుండా చాలామందిని చంపేస్తుంటాడు. ఓ రకంగా ఇది మణిరత్నం- కమల్ హాసన్ ల నాయకుడు సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయిన కథలా కనిపిస్తోంది.
ఆశ్చర్యం ఏంటంటే.. చాలాయేళ్ల తర్వాత రీసెంట్ గా శింబు మానాడు(తెలుగులో లూప్) సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత చేస్తోన్న ఈ చిత్రంలో అతని మేకోవర్ డీ గ్లామర్ గా ఉంది. నిరుపేద పల్లెటూరి యువకుడిలాగా కనిపిస్తున్నాడు. టీజర్ మాత్రం చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తోంది. టీజర్ చూస్తే ఈ చిత్రం తెలుగులోనూ విడుదలైనే బావుండు అనిపిస్తోంది. మొత్తంగా స్టైలిష్ మూవీస్ తో ఆకట్టుకునే ఈ ఇద్దరూ ఇలా మారిపోవడం మంచిదే. మరి ఈ మార్పు విజయాన్నిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts