సమంతపై అప్పుడలా.. ఇప్పుడిలా..

అభిమానం హద్దులు దాటితే అభిప్రాయాలు కూడా రుద్దడం మొదలుపెడతారు. తాము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అవతలి వారు అలాగే ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఇవి హుందాగా ఉంటే ఫర్వాలేదు. బట్ చాలాసార్లు పరిధిలు మించి కనిపిస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం అక్కినేని నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది ఆమెపై తమ అభిప్రాయాలనే రుద్దాలని చూశారు. తప్పంతా సమంతదే అంటూ తీర్మానాలూ చేశారు. కొందరైతే ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేశారు. ముఖ్యంగా వెబ్, డిజిటల్ మీడియంలో అసత్యమైన, అసభ్యమైన రాతలు రాశారు. ఆమె కోణం నుంచి కాకుండా తమ కోణంలోనే తీర్పులు ఇచ్చారు. అన్నేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కాపురం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నారు అంటే దానికి ఖచ్చితంగా వారి కారణాలు వారికి ఉంటాయి. పైగా ఇద్దరూ హుందాగానే విడిపోయారు. మా బతుకు మేం బతుకుతాం.. వదిలేయండి అని చెప్పారు. ఊహూ.. వింటేనా వినలేదు. ఇలా ఇస్టం వచ్చిన రాసుకున్నారు. ఈ విషయంలో సమంత చాలాసార్లు తనదే తప్పంతా అనడం గురించి మాట్లాడింది.