విలక్షణ శైలి ఉన్న దర్శకుడు సాగర్

తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు సీనియర్స్‌ అంతా కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ డైరెక్టర్ సాగర్ కన్నుమూయడంతో పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన వయసు 70యేళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ గురువారం ఉదయం 6 గంటలకు చెన్నైలోని తన ఇంట్లో మృతి చెందారు.


సాగర్ కుటుంబం గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలోని నిడమర్రు గ్రామానికి చెందిన వారు. తండ్రి మునసబుగా చేసేవారు. పిల్లలకు మంచి చదువు చెప్పించాలని.. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన మద్రాస్ కు వెళ్లారు. అలా సాగర్ చిన్నతనం నుంచీ చెన్నైలోనే ఉన్నారు. చదువైన తర్వాత కొన్నాళ్ల పాటు ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేసినా.. ఓ బంధువు వల్ల మానేయాల్సి వచ్చింది. అటుపై అట్లూరి పుండరీకాక్షయ్య తనయుడుతో ఉన్న పరిచయంతో దర్శకుడు బి.వి ప్రసాద్ వద్ద మహ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అలా ఆయన వద్దే దాదాపు పన్నెండేళ్ల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. తను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్న తర్వాత అప్పట్లో అందరిలానే కృష్ణగారి వద్దకు వెళ్లారు. ఆయన బిజీగా ఉండటంతో మరో వ్యక్తి సలహా మేరకు నరేష్‌ హీరోగా రాకాసి లోయ అనే సినిమాతో దర్శకుడుగా మారారు.

నరేష్‌ సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజేష్‌, ముచ్చర్ల అరుణ, రంగనాథ్, దీప ఇతర జంటలుగా నటించారు. మాస్ మూవీ కావడంతో కమర్షియల్ గా వర్కవుట్ అయింది. తర్వాత భానుచందర్, సుమన్ హీరోలుగా డాకు అనే యాక్షన్ మూవీ చేశారూ ఇదీ హిట్ అయింది. దీంతో తనే నిర్మాతగానూ మారి నరేష్ తోనే మా వారి గోల అనే కామెడీ సినిమా తీశారు. ఇది పోయింది. దర్శకుడు, నిర్మాతగా లాస్ కావడంతో కొన్నాళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్నారు.

మూడేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని భానుచందర్ హీరోగా స్టూవర్ట్ పురం దొంగలు అనే సినిమా చేశారు. ఈ చిత్రం విడుదల కావడానికి ముందు వారం చిరంజీవి స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అలా మళ్లీ మాస్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన తర్వాత 1995లో సూపర్ స్టార్ కృష్ణతో తీసిన అమ్మదొంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటుపై సుమన్ తో చేసిన ఓసి నా మరదలా, రామసక్కనోడు చిత్రాలు కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నాయి.

కొత్త శతాబ్ధిలో తీసిన అన్వేషణ, యాక్షన్ నెంబర్ వన్, ఖైదీ బ్రదర్స్( రామ్ లక్ష్మణ్‌ హీరోలు) చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో దర్శకత్వానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తన కెరీర్ లో దాదాపు 40 చిత్రాలను డైరెక్ట్ చేశారు సాగర్. దర్శకుడుగా సాగర్ ది విలక్షణ శైలి. మాస్, యాక్షన్ ప్రధానమైన చిత్రాలే ఎక్కువగా చేసినా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గానే కనిపిస్తాయి. అసభ్యత లేని చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారానయ. ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న వివి వినాయక్, శ్రీను వైట్ల ఈయన శిష్యులే కావడం విశేషం. ఇక దర్శకుల సంఘం అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేశారు సాగర్.


వ్యక్తిత్వ పరంగా కాస్త దూకుడైన వ్యక్తి అని చెబుతారు. ఎవరినీ లెక్క చేసేవారు కాదు. నిజాన్ని నిర్భయంగా, నిక్కచ్చిగా చెబుతారు అనే పేరుంది. మొత్తంగా చిన్న తనం నుంచీ చెన్నైలోనే ఉంటోన్న ఆయన మరణం పరిశ్రమలో విషాద వాతావరణాన్ని సృష్టించింది.

Related Posts