హ్యాపీ బర్త్ డే జగపతిబాబు

జగపతి బాబు.. ఈ పేరు వినగానే ఆయన చేసిన ఎన్నో పాత్రలు కళ్లముందు కదలాడతాయి. అసలు నటుడిగానే పనికిరాడనుకున్న జగపతి ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో పెద్ద ఇమేజ్ తెచ్చుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా పలు నంది అవార్డులు అందుకుని విమర్శకుల నోళ్లుమూయించాడు. శోభన్ బాబు తర్వాత మహిళాభిమానులను ఆ స్థాయిలో సంపాదించుకున్న జగపతి బాబు రియల్ లైఫ్ లోనూ మ్యాన్లీ హీరో అనిపించుకున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 12) జగపతి బాబు బర్త్ డే.

హీరోగా కెరీర్ డల్ ఫేజ్ కు చేరుకున్న సమయంలో.. విలన్ గా టర్న్ తీసుకుని సరికొత్త కెరీర్ ను తీర్చిదిద్దుకున్నాడు జగపతి బాబు. హీరోగా పెద్దగా ప్రయోగాల జోలికి వెళ్లని జగపతి.. విలన్ రోల్స్ కోసం ఆహార్యం మొదలుకొని డైలాగ్ డెలివరీ వంటి ప్రతీ విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. ‘లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత, జయ జానకి నాయక’ వంటి చిత్రాలు.. జగపతి బాబు లోని విలనీకి మంచి ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు.

ప్రస్తుతం జగపతి బాబుకు భారీ డిమాండ్ ఉంది. అతని కోసం కొత్త పాత్రలూ పుట్టుకొస్తున్నాయి. లేదా కొన్ని రెగ్యులర్ క్యారెక్టర్స్ కూడా పవర్ ఫుల్ అనే ట్యాగ్ ను తగిలించుకుంటున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బిజీ అవుతున్నాడు. జగపతి కిట్టీలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘సలార్, గుంటూరు కారం’ చిత్రాల్లో నిడివి తక్కువ ఉన్నా.. ప్రాధాన్యత గల పాత్రల్లో అలరించాడు. అయితే.. ‘సలార్’ పార్ట్ 1 కంటే.. పార్ట్ 2లో జగపతి రోల్ ఎక్కువ నిడివితో ఉండబోతుంది. అలాగే.. ‘పుష్ప 2’లోనూ మ్యాన్లీ స్టార్ ప్రాధాన్యత గల పాత్రలో కనిపించనున్నాడట.

Related Posts