ఆ విషయంలో బాలయ్య తర్వాతే ఎవరైనా..?

నందమూరి బాలకృష్ణ.. తన తరం హీరోలతో పోలిస్తే మాస్ లో ఇప్పటికీ ఏ మాత్రం తరగని ఇమేజ్ ఉన్న స్టార్. అన్నగారి వారసుడుగా వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను చాలా త్వరగానే సంపాదించుకున్నాడు. బాలయ్య అనే పేరుతో ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ముద్రవేశాడు. ఫిక్షన్ నుంచి ఫ్యాక్షన్ వరకూ.. జానపదాల నుంచి పౌరాణికాల వరకూ, సోషలైజ్డ్ స్టోరీస్ నుంచి హిస్టారికల్ మూవీస్ వరకూ .. ఇలా ఏ పాత్రైనా చేయగల సత్తా ఉన్న ఏకైక స్టార్ గానూ బాలయ్యను చెప్పొచ్చు. ఇలా ఎన్నో స్పెషల్ టాలెంట్స్ ఉన్నా.. బాలయ్య నెంబర్ వన్ హీరో అనిపించుకోకపోవడం ఓ విశేషంగానే చెప్పాలి. చిరంజీవి తర్వాతి స్థానంలోనే ఆగిపోయాడు. కానీ ఇప్పుడు చిరు కంటే ఎక్కువగా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు బాలయ్య. అయితే ఆ తరం నుంచి ఈ తరం వరకూ ఒక్క విషయంలో బాలయ్యను మించిన స్టార్ లేడనే చెప్పాలి. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయం వింటే ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతారంతే.
ఇవాళా రేపూ ఒక్క సినిమా హిట్ అయిందంటే రాత్రికి రాత్రే రెమ్యూనరేషన్ ను డబుల్ చేస్తున్నారు. పరిశ్రమకు వచ్చి పదేళ్లు కూడా హీరోలు 10- 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ 40యేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టిన సినిమాలు చేసిన బాలయ్య మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. నిర్మాతలు ఇచ్చిందే తీసుకుంటున్నాడు తప్ప.. ఇప్పుడు తన రేంజ్ ఇది కాబట్టి.. ఇంత ఇవ్వాల్సిందే అని ఖచ్చితంగా చెప్పడు. అలాగే పూర్తి రెమ్యూనరేషన్ ఇస్తేనే డబ్బింగ్ అనే రూల్స్ కూడా పెట్టడు. అందుకే ఈ తరం యంగ్ స్టర్స్ కంటే కూడా బాలయ్య రెమ్యూనరేషన్ చాలా తక్కువ అంటే ఆశ్చర్యపోక తప్పదు.
ఈ విషయంలో బాలయ్య డిమాండ్ చేయకపోవడానికి కారణం.. ఆయన డబ్బును లెక్క చేయకపోవడమే అంటారు దగ్గరివాళ్లు. ఇండస్ట్రీ నిలబడాలంటే నిర్మాత ఆనందంగా ఉండాలనే పాతతరం ఆలోచనకు ప్రతినిధిలా ఇప్పటికీ బాలయ్య నిలబడుతున్నాడు. తండ్రి నుంచి వచ్చిన ఆ సంస్కారాన్ని ఆచరిస్తున్నాడు. లేదూ బాలయ్య కూడా కాదూ ఖచ్చితం అని డిమాండ్ చేసి ఉంటే ఆయనకూ 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఏదేమైనా బాలయ్యను ఫ్యాన్స్ ఆ రేంజ్ లో ఎందుకు ఆరాధిస్తారనేదానికి ఇది ఒక ఉదాహరణ.