ఆ మూడు చిత్రాలే నా కెరీర్ ను మార్చేశాయి.. మహేష్ బాబు

మహేష్ బాబు.. అసలు డిబేట్ అవసరం లేని ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. బాల నటుడిగా ప్రస్తానాన్ని ప్రారంభించి.. కథానాయకుడిగా అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయడానికి రెడీ అవుతోన్న మహేష్ బాబు.. లేటెస్ట్ గా నేషనల్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తన కెరీర్ ను మలిచిన చిత్రాలుగా మూడు సినిమాలను ప్రస్తావించాడు. అవే ‘మురారి, పోకిరి, శ్రీమంతుడు’. ఈ మూడు సినిమాలు తనను ఎంతో వైవిధ్యంగా ఆవిష్కరించాయని.. అన్ని వర్గాల ప్రేక్షకులకు తనను చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపాడు మహేష్.

2001లో వచ్చిన ‘మురారి’ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ఈ సినిమాతో క్లాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు మహేష్. ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్. ఇక.. 2006లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఆ తర్వాత పలు భాషల్లో రీమేకై.. అక్కడా ఘన విజయాలు సాధించింది. 2015లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం క్లాస్, మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూనే.. ఓ మంచి సందేశాన్నందించింది. ఈ సినిమా కూడా మహేష్ బాబు కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ గా చెప్పబడుతుంది.

ప్రస్తుతం సూపర్ స్టార్.. తన ఫోకస్ అంతా రాజమౌళి సినిమాపైనే పెట్టాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి వర్కవుట్స్ మొదలుపెట్టాడు. ఆమధ్య జర్మనీలో ఈ అడ్వంచరస్ థ్రిల్లర్ కోసం రిగరస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. త్వరలోనే మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ లాంఛ్ జరగనుంది.

Related Posts