స్లమ్ డాగ్ హస్బండ్

రివ్యూ : స్లమ్ డాగ్ హస్బండ్

తారాగణం: సంజయ్ రావు, ప్రణవి, సప్తగిరి, బ్రహ్మాజీ, యాదమ్మ రాజు, మురళీధర్ గౌడ్ తదితరులు
ఎడిటర్: వైష్ణవ్ వాసు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కెమెరా:శ్రీనివాస్ జె రెడ్డి
నిర్మాతలు:అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి
దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్
రిలీజ్ డేట్: 29.07.2023

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న నటుడు బ్రహ్మాజీ.ఇండస్ట్రీలో అతనికి అందరితోనూ పరిచయాలున్నాయి.హీరోల కొడుకులు హీరోలవుతున్నారు కాబట్టి తన కొడుకు సంజయ్ రావును కూడా హీరోగా మార్చాడు.ఇంతకు ముందే ఓ పిట్టకథ అనే చిత్రంతో పరిచయం అయ్యాడు.ఆ మూవీ ఆకట్టుకోలేదు. ఇప్పుడు స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమాతో వచ్చాడు. ప్రమోషన్స్ పరంగా తనకు ఉన్న అన్ని పరిచయాలను ఉపయోగించాడు బ్రహ్మాజీ.రిలీజ్ కు ముందు కొంత వరకూ సౌండ్ చేసిన ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ ఎలా ఉన్నాడో చూద్దాం..

కథ :
లక్ష్మణ్(సంజయ్ రావు) మౌనిక(ప్రణవి) ప్రేమించుకుంటారు.పెళ్లి చేసుకునేందుకు ఇద్దరి ఇళ్లల్లో ఒప్పిస్తారు. తీరా పెళ్లి చేసుకునే ముందు జాతక దోషాలు పోవాలంటే ముందు కుక్కనో చెట్టునో పెళ్లి చేసుకోవాలని చెబుతాడు బ్రాహ్మణుడు.తన ఫ్రెండ్ సత్తి(యాదమ్మరాజు) సాయంతో ఓ కుక్కను తెచ్చి వైభవంగా పెళ్లి చేసుకుంటాడు.ఇక దోషం పోయిందని తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమైతే.. ముందు కుక్కకు విడాకులుతో పాటు 20లక్షల భరణం ఇచ్చి తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని కుక్క యజమాని కోర్ట్ లో కేస్ వేస్తాడు.దీంతో మౌనికతో పెళ్లి ఆగిపోతుంది. అసలే కళ్లద్దాలు అమ్ముకుని బతికే లక్ష్మణ్ 20 లక్షలు కట్టడమంటే అసాధ్యం. మరి ఈ కేస్ ఎటు తేలింది..? మౌనిక అతని కోసం ఆగిందా వేరే పెళ్లి చేసుకుందాం..? ఈ కేస్ లో కోర్ట్ ఎలాంటి తీర్పు ఇచ్చింది అనేది మిగతా కథ.

విశ్లేషణ :
కొన్ని కథలు వెండితెరపై కంటే బుల్లితెరపైనే బావుంటాయి. ఇది కూడా అలాంటి కథే. ఓఫీచర్ ఫిల్మ్ లేదా ఓటిటి వరకూ సరిపోయే కంటెంట్. ఇలాంటి కంటెంట్ వెండితెరపైకి వస్తే లెంగ్తీగా అనిపిస్తుంది. సాగదీతగా కనిపిస్తుంది. స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే కథ కూడా అలాంటిదే.జాతక దోషాలు, గ్రహాలు అంటూ కొంతమంది పంతుళ్లు చేసే మోసాల వల్ల జనం ఎలా ఇబ్బందులు పడుతున్నారు.మనిషికంటే జంతుకు ఎందుకు గొప్పది అనే పాయింట్స్ ను చెప్పడానికి చాలా పెద్ద సెటప్ చేసుకున్నాడు దర్శకుడు శ్రీధర్. మొదట హీరో హీరోయిన్ లవ్ స్టోరీయే అసంబద్ధంగా ఉంది. ఇద్దరూ ఏదో చదువుకుంటున్నవాళ్లు కాదు. ప్రొఫెషనల్ గా బిజీగానూ ఉండరు.అతను కళ్లద్దాలు అమ్ముతుంటాడు. అమ్మాయి ఖాళీ. ఈ ఇద్దరికి పెళ్లి విషయంలో ఏ అడ్డంకీ లేదు. అయినా వారి కక్కుర్తి కోసం అంటూ కనిపించిన సన్నివేశాలు, డైలాగ్స్ అన్నీ అర్థ రహితంగా ఉన్నాయి తప్ప మంచి ప్రేమకథకు సరిపోయే కంటెంట్ లా ఉండదు. మామూలుగా జాతక దోషం అనేది పుట్టిన తేదీ, నక్షత్రాలు, ఇవన్నీ చూసిన తర్వాత కుదరకపోతే చెబుతారు. బట్ ఇందులో ఈ ఇద్దరికీ సరైన డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అందుకోసం వారి తల్లులతో చెప్పించిన డైలాగ్స్ దర్శకుడి చీప్ టేస్ట్ కు అద్దం పడతాయి. బ్రాహ్మణుడి మాట విని కుక్కతో పెళ్లి చేసుకోవడం అనేది అంత హంగామాతో ఉండటం అనేది వారి ఇష్టారాజ్యంగా తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ తప్ప ఏ మాత్రం అర్థం లేనిది. కుక్కనో, చెట్టునో పెళ్లి చేసుకోకపోతే హీరో తల్లి, హీరోయిన్ తల్లి లేదా హీరోయిన్నే చనిపోతుందని బెదిరిస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఇక్కడ అలాంటి వారిలో కొందరి మోసాలను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక కుక్కకు విడాకులు, భరణం అనే పాయింట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడిన తర్వాత కోర్ట్ లో సాగే తతంగం అంతా సహనానికి పరీక్ష పెడుతుంది. ఇంతా చేస్తే దర్శకుడుచివర్లో ఏం చెప్పబోతున్నాడు అనేది సులువుగానే ఊహిస్తాం. కాకపోతే విలన్ విషయంలో కాస్త ఆశ్చర్యపరిచాడు. అఫ్ కోర్స్ అదీ ఊహించడానికి దగ్గరగానే ఉంటుంది.


తనకు కుక్కతో విడాకులు కావడం అసాధ్యం అని తెలిసినప్పుడు తన చుట్టూ ఉన్న మనుషులు ఎలా ప్రవర్తిస్తారు.. అనేది చెప్పాలనుకోవడమే దర్శకుడి అసలు ఉద్దేశం. డివోర్స్ఇప్పట్లో రాదని ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లికి సిద్ధం అవుతుంది.ఏ తల్లి చనిపోతుదని కుక్కను పెళ్లి చేసుకున్నాడో ఆమె ప్రవర్తనా బాధిస్తుంది.చుట్టూ ఉన్న మనుషులంతా తనను చీప్ గా చూడటం.. మీడియా దానికి ఆజ్యం పోయడం.. ఒక వ్యక్తి ఎమోషన్స్ తో పనిలేకుండా అతని జీవితంతో చుట్టూ ఉన్నవాళ్లు ఆడుకోవడం.. ఈ టైమ్ లో ఒక్కరోజు ఫుడ్ పట్టినందుకు కుక్క చూపించిన విశ్వాసం మనిషి చూపించలేకపోయాడనే “సందేశాన్ని” తెలియజేశాడు దర్శకుడు. ఈ మాత్రానికి ఇంత పెద్ద సినిమా అవసరమా అంటే అవసరమే. వాళ్లకు అవకాశం ఉంది చూపించారు అంతే అనుకోవడం తప్ప ఏం చేయలేం.
ఈ కథలో కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి.జాతకం, గ్రహాలు అంటూ ఏమీ ఉండవు. రోజూ కష్టపడి పనిచేసుకుని హ్యాపీగా తిని ఎవరికీ హాని చేయకుండా ఉంటే ఏ గ్రహాలు దోషాలు ఏం చేస్తాయి. అసలు అవి లేవు అనే పాయింట్ చెప్పాడు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన మనుషులు అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనేది చర్చించే ప్రయత్నం చేశాడు. ఇవి తప్ప సినిమాలో పెద్దగా ఏమీ కనిపించదు.

నటన పరంగా సంజయ్ రావు ఇంకా ఓనమాల దశలోనే ఉన్నాడు. హీరోయిన్ ప్రణవి బావుంది. ఛలాకీగా నటించింది. ఈ తరహా మీడియం రేంజ్ సినిమాలకు మంచి ఆప్షన్ అవుతుంది. ఇతర పాత్రల్లో సప్తగిరి ఎప్పట్లానే ఓవరాక్షన్ చేశాడు. బ్రహ్మాజీ పాత్ర పలికిన డైలాగ్స్ ఆ వర్గం వారిని కించపరిచేలానే ఉన్నాయి. యాదమ్మ రాజు పాత్ర ఆశ్చర్యపరుస్తుంది. బాగా చేశాడు కూడా. ఇతర పాత్రలన్నీ ఇక రొటీన్.
టెక్నికల్ గా బిగ్ ఎసెట్ మ్యూజిక్. పాటలన్నీ బావున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బావుంది. లొకేషన్స్ సహజంగా కనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా కట్ చేయాల్సిన చాలా సీన్లే ఉన్నాయి.అది దర్శకుడి నిర్ణయం కాబట్టి ఎడిటర్ ను ఏమీ అనలేం. డైలాగ్స్ అక్కడక్కడా ఓకే. కాస్ట్యూమ్స్ హైదరాబాద్ లో ఉంటున్న అమ్మాయిల్లో ఈ రోజుల్లో హాఫ్ శారీస్ ఎవరు వేస్తున్నారో తెలియదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సినిమా రేంజ్ కు చాలా చిన్నది. అందువల్ల అనేక సీన్లలో సాగదీత కనిపిస్తుంది. సహనానికి పరీక్షలా ఉన్నాయి. టేకింగ్, మేకింగ్ పరంగానూ మెస్మరైజ్ చేసినవేం లేవు.

ప్లస్ పాయింట్స్

నేపథ్య సంగీతం, పాటలు
కొన్ని సీన్స్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

కథ
స్క్రీన్ ప్లే
కోర్ట్ రూమ్ డ్రామా
దర్శకత్వం
హీరో

ఫైనల్ గా : పూర్ హస్బండ్

రేటింగ్ : 2/5

– బాబురావు. కామళ్ల

Related Posts