విలనిజంలో రాజనాల రాజసం

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతినాయక పాత్రల ప్రస్తావన రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు రాజనాల. ఇంటిపేరుతోనే పాపులరైన రాజనాల.. పౌరాణిక, జానపద, సాంఘిక ఇలా.. ఏ తరహా సినిమాయైనా తనదైన గాంభీర్య నటనతో ఆయా పాత్రలకు వన్నె తెచ్చారు. మంచి శరీర సౌష్టవంతో కథానాయకులకు దీటుగా కనిపిస్తూ.. ప్రతినాయక పాత్రలలో క్రూరత్వాన్ని అద్భుతంగా పండించిన రాజనాల జయంతి ఈరోజు (జనవరి 3).

1928 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. ఆయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు. అయితే ‘రాజనాల’ పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది. 1953 నుంచి 1978 వరకు రాజనాల నట జీవితంలో స్వర్ణయుగంగా చెప్పొచ్చు. హీరో ఎన్టీఆర్‌ అయినా, కాంతారావు అయినా విలన్‌ మాత్రం రాజనాలే. జానపద చిత్రాల్లో రాజనాల విలనిజాన్ని విజృంభించేలా చేశారు. 1953 నుంచి 1966 వరకు 150 చిత్రాలు వరుసగా చేసి అప్పట్లో రికార్డు సృష్టించారు రాజనాల.

రాజనాల… ‘కింగ్‌ ఆఫ్‌ విలన్స్‌’గా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు నటుడుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచారు. అవకాశాలు అందిపుచ్చుకుని ఆకాశాలు ఈదారు. వెండితెర వైభవాన్ని సంపూర్ణంగా అనుభవించారు. అంతలోనే… విధి వక్రించి పాతాళాల అంచుల్లోకి జారిపోయారు. తెలుగు చలనచిత్ర సీమలో అధిక పారితోషికం తీసుకున్న విలన్ గా పేరు తెచ్చుకున్న రాజనాల.. చివరి రోజుల్లో దుర్భర జీవితాన్ని అనుభవించారు. చివరికి అన్ని బాధల నుంచి విముక్తిగా 1998 మే 21న తనువు చాలించారు.