అమెజాన్ లో ‘లవ్ మీ’.. నెట్‌ఫ్లిక్స్ లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

మే నెల చివరిలో ఆడియన్స్ ముందుకొచ్చిన ‘లవ్ మీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేశాయి. ‘లవ్ మీ’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నెట్‌ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ‘లవ్ మీ’ సినిమా విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి వస్తే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో సందడి చేస్తుంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త బ్యానర్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన చిత్రం ‘లవ్ మీ’. ఘోస్ట్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన హారర్ థ్రిల్లర్ ఇది. ‘లవ్ మీ.. ఇఫ్ యూ డేర్’ అనే టైటిల్ తో అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి, పి.సి.శ్రీరామ్ వంటి లెజెండరీ టెక్నిషియన్స్ ఈ మూవీకి పనిచేశారు. ఓ విభిన్నమైన కథా చిత్రంగా మే 25న థియేటర్లలోకి వచ్చిన ‘లవ్ మీ’కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

తెలుగులో వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుల్లో విశ్వక్ సేన్ ముందు వరుసలో ఉంటాడు. ఈకోవలో ఆడియన్స్ ముందుకొచ్చిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటించింది. మరో కీలక పాత్రలో అంజలి నటించింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కృష్ణ చైతన్య తెరకెక్కించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి మిక్స్‌డ్ రివ్యూస్ దక్కినా.. మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్ నటనకు మంచి పేరొచ్చింది. మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ థియేటర్లలోకి వచ్చింది.

Related Posts