తెలుగు సినిమా కీర్తి కిరీటం ఏఎన్నార్

అక్కినేని నాగేశ్వరరావు ..
అత్యంత సామాన్యమైన నేపథ్యం
అసమాన ప్రతిభా శిఖరం
ఆరుదశాబ్దాల నటనా వైదుష్యం
తెలుగు సినిమా కీర్తి కిరీటం
పట్టుదల, క్రమశిక్షణతో
తెలుగు సినిమా సామ్రాజ్యంలో సామ్రాట్ గా వెలిగిన
నటనా వైతాళికులు అక్కినేని నాగేశ్వరరావుగారు.
ఇది అక్కినేని శతజయంతి యేడాది. ఈ యేడాదంతా ఆయన సినీ సంబరాలే. ఈ సందర్భంగా ఆ నట సామ్రాట్ చిత్ర విశేషాలను ఒకసారి స్మరించుకుందాం..

అక్కినేని ఎక్కలేని ఎత్తుల్లేవు…అక్కినేని తొక్కలేని స్టెప్పుల్లేవు.. అక్కినేని చేయలేని పాత్రల్లేవు…ఇలా ఒక సందర్భంలో అక్కినేని దండకం రాశారు ముళ్లపూడి. అది అక్షరసత్యం. ఏ పాత్రకైనా ఇట్టే ఇమిడిపోయే మనిషి కాకపోయినా.. పాత్రను అధ్యయనం చేసి ఏ పాత్రనైనా రక్తి కట్టించగల నట పరిశోధకుడు అక్కినేని. అదే ఆయన సక్సస్ మంత్రం. ఆ మంత్రాన్నే వెండితెరపై చూపించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు.
బాలనటుడుగా ధర్మపత్నిలో తెరంగేట్రం చేశారు అక్కినేని. కొంత గ్యాప్ తర్వాత యవ్వన ప్రారంభంలో సీతారామజననంలో శ్రీరాముడుగా చేసిన అక్కినేని ఆ తర్వాత జానపద నాయకుడుగా కత్తిదూసి తెలుగు తెర తొలి సూపర్ స్టార్ అయ్యారు. వరసగా బాలరాజు, ముగ్గురు మరాఠీలు, కీలుగుర్రం చిత్రాలతో అక్కినేనికి తిరుగులేదనిపించారు. నిజానికి పాతాళభైరవి పాత్రకు ముందు అనుకున్న నటుల్లో ఎఎన్నార్ కూడా ఉండడం విశేషం.


నాగేశ్వరరావు అందగాడు కాదు…నాగేశ్వరరావుకు మంచి కళ్ళు లేవు. కంఠం అంత కన్నా లేదు. ఒడ్డూ పొడుగూ విగ్రహం లేదు. బాషా పాండిత్యం లేదు. ఇంతెందుకు నటుడికి కావలసిన లక్షణాలు అసలు లేవు. అయినా-హీరో అయ్యాడు…ఇప్పటికీ హీరోగా ఉన్నాడు..ఇంకా ఉంటాడు…ఇవి ఆత్రేయ అక్కినేని గురించి చెప్పిన మాటలు. అయినా ఎందుకు అంత పెద్ద నటుడయ్యాడు అంటే.. ముందే చెప్పినట్టు ఆయన నట పరిశోధకుడు. అందుకే ఎవరెన్ని అనుకున్నా.. తను చేసిన అన్ని పాత్రల్లోనూ అద్భుతం అనిపించారు. అఖండ విజయాలు అందుకున్నారు.
అక్కినేని నిరంతర విద్యార్ధి. స్వీయలోపములెరుగుట పెద్ద విద్య అనే విషయం ఆయన బలంగా నమ్మారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రలకు తనను తాను అడాప్ట్ చేసుకున్నారు. సాంఘికాలే చేయాలనుకున్నా…మొనాటనస్ కాకుండా చూసుకున్నారు. ప్రతి పాత్రా ప్రత్యేకంగా ఉండేలా తనను తాను తర్ఫీదు చేసుకున్నారు. ఆ తపనే ట్రాజడీ కింగ్ అనే పేరొచ్చాక అదరిపోయే కామెడీ చేయించింది.
అక్కినేనికి ముందు చూపు ఎక్కువ. సొంత నిర్మాణ సంస్ధ ఉండడం శ్రేయస్కరం అనుకున్నారు. అంతే తను ఛైర్మన్ గా గురువు దుక్కిపాటి మధుసూధనరావు మేనేజింగ్ డైరక్టర్ గా, డిస్ట్రిబ్యూటర్ కాట్రగడ్డ శ్రీనివాసరావు తదితరులు డైరక్టర్లుగా అన్నపూర్ణ పిక్చర్స్ అనే బ్యానర్ ప్రారంభించి కె.వి.రెడ్డితో దొంగరాముడు తీశారు.

తనదైన పంథాలో కొనసాగుతూనే…ఎన్టీఆర్ తో కలసి సుమారు పద్నాలుగు సినిమాల్లో నటించారు. వాటిలో పౌరాణికాల సంఖ్యే అధికం. కేవలం తన నటనతోనే ఎన్టీఆర్ తో పోటీ పడేవారాయన. మాయాబజార్ లో అభిమన్యుడుగా ఆకట్టుకున్నారు. శ్రీ కృష్ణార్జున యుద్దంలో అర్జునుడుగా ఎన్టీఆర్ ను ఢీకొంటారు. భూకైలాస్ లో నారదుడి పాత్రలో ఎన్టీఆర్ ను ముప్పతిప్పలు పెడతారు. ప్రేక్షకుల ఆలోచనల్లోనూ, అభిరుచుల్లోనూ వస్తున్న మార్పులను చాలా జాగ్రత్తగా గమనించేవారు అక్కినేని. అందుకు తగ్గట్టుగా తనను తాను మౌల్డ్ చేసుకునేవారు. ఈ క్రమంలో భాగంగానే…ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఏ పనిచేసినా కృషే. ప్రేక్షకులకు కొత్త నాగేశ్వరరావును పరిచయం చేయడం కోసం కొత్త దర్శకులతో సినిమాలు చేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగానే విశ్వనాథ్ తో ఆత్మగౌరవం తీస్తే…బాపు బుద్దిమంతుడుగా ద్విపాత్రాభినయం చేయించారు.
పాత్రను అవగాహన చేసుకోవడంలో అక్కినేని ఓ డిక్షనరీ. ఓ పాఠశాల. నవరసాలనూ అవలీలగా పోషించాడు కాబట్టే ఈ నటుడు నటసామ్రాట్టయ్యాడు. ఏఎన్నార్ సినిమాల్లో తనతో పాటు హీరోయిన్ల పాత్రలూ చాలా బలంగా ఉంటాయి. ఇమేజ్ తో కాకుండా కథను బట్టే ఆయన జడ్జిమెంట్ ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఎన్ని సినిమాలైనా చెప్పొచ్చు.


ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నంలో భాగంగానే…తెలుగు తెరకు డాన్సులు పరిచయం చేశారు. దసరాబుల్లోడు కు ముందు తెలుగు సినిమా హీరో పెద్దగా డాన్సులు చేసేవాడు కాదు. ఆయన పాడుతూ ఉంటే హీరోయిన్ డాన్స్ చేయడం రివాజు. దీన్ని సమూలంగా మార్చి కేవలం తన స్టెప్పులతో ధియేటర్లను మోతెక్కించారు అక్కినేని.


మనంతో కలిపి అక్కినేని నటించిన చిత్రాల సంఖ్య 256. అందులో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలే రెండొందల పైచిలుకు ఉంటాయి. అక్కినేని ఎన్నడూ తన స్థాయికి తగని చిత్రాలు చేయలేదు. పాత్రల్లో నటించలేదు. చివరి రోజుల వరకు దాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చారు.


ఏఎన్నార్ మరణంలోనూ హీరోగానే వెళ్లిపోయాడు. తన మరణానికి ముందే అయినావాళ్లను అభిమానులను ప్రిపేర్ చేశాడు. చావును సవాల్ చేస్తున్నా అని హీరోలానే ఎదురుతిరిగాడు. ఏదో ఒక సినిమాలో తన పాత్ర చివరలో చనిపోతుంది అన్నంత సహజంగానే అంతర్థానమయ్యారు. అందుకే ఏఎన్నార్ మరణం ఓ పాత్ర ముగిసినట్టుగానే అనుకున్నారు జనం. కానీ అలాంటి పాత్రలతో చరిత్ర సృష్టించిన ఆ రూపం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందనేది నిజం.. అందరికీ తెలిసిన ఆ నిజాన్ని మరోసారి స్మరించుకుంటూ ఈ శతజయంతి యేడాది సందర్భంగా మరిన్ని సార్లు ఆయన గురించి, ఆయన పాత్రల గురించి మాట్లాడుకుందాం..

                              - బాబురావు.కామళ్ల

Related Posts