‘మనమే‘ రివ్యూ

నటీనటులు: శర్వానంద్‌, కృతిశెట్టి, విక్రమ్‌ ఆదిత్య, సీరత్‌కపూర్‌, ఆయేషా ఖాన్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రవీంద్రన్‌, రాహుల్‌ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్‌ తదితరులు
సినిమాటోగ్రఫి: జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌., విష్ణు శర్మ
సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
నిర్మాతలు: టి.జి. విశ్వప్రసాద్‌
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
విడుదల తేది: 07-06-2024

రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగకుండా.. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక పంథాలో సాగే ఛాలెంజింగ్ హీరో శర్వానంద్.
‘ఒకే ఒక జీవితం’తో హిట్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్.. ఇదే ఊపులో ఇప్పుడు ‘మనమే‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టి నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మనమే‘ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ
ఏ సంబంధం లేని అబ్బాయి, అమ్మాయి.. అనుకోని పరిస్థితుల్లో ఒక బాబుకు సంరక్షకులుగా ఉండాల్సి వస్తే.. ఆ ప్రయాణం వాళ్లిద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందన్నదే క్లుప్తంగా ‘మనమే‘ కథ. ఈ కథను మరింత విస్తరించి చెప్పాల్సి వస్తే.. లండన్ లో జాలీగా గడిపేస్తుంటాడు విక్రమ్ (శర్వానంద్). అతనికి అనురాగ్ అనే ఓ ఫ్రెండ్ ఉంటాడు. అతిని ప్రేమపెళ్లిని విక్రమ్ దగ్గరుండి జరిపిస్తాడు. అనురాగ్ తన భార్యతో కలిసి ఇండియా వచ్చినప్పుడు ఓ యాక్సిడెంట్ లో భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతారు. దాంతో.. వాళ్లిద్దరి తనయుడు ఖుషి (విక్రమ్ ఆదిత్య)ను అనురాగ్ ఫ్రెండ్ అయిన విక్రమ్.. అలాగే.. అనురాగ్ భార్య శాంతి ఫ్రెండ్ అయిన సుభద్ర (కృతి శెట్టి) చూసుకోవాల్సి వస్తుంది. బాబు కోసం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సి వచ్చిన విక్రమ్, సుభద్ర మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే ‘మనమే‘ కథ.

విశ్లేషణ
లండన్ లో మాస్టర్స్ పూర్తి చేసి ఖాళీగా ఉంటూ జీవితాన్ని జాలీగా గడిపేచే విక్రమ్ వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉంటుంది సుభద్ర వ్యక్తిత్వం. భిన్న స్వభాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ పిల్లాడి కోసం కలిసి ఉండడం అనే పాయింట్ కొత్తగా ఉంది. పిల్లాడు ఖుషి బాధ్యతలు చూసుకునే క్రమంలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

పిల్లాడ్ని చూసుకోవడానికి విక్రమ్‌ పడే అవస్థలు.. ఖుషి చేసే అల్లరి.. వీరిద్దరితో వేగలేక సతమతమయ్యే సుభద్ర బాధలు.. వీరి మధ్యలోకి వెన్నెల కిషోర్ ఎంట్రీ.. ఆద్యంతం వినోదభరితంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఇక.. ఆరంభంలోనే సుభద్రకు పెళ్లి కుదిరినట్లు చెప్పడం వల్ల ఆమెతో విక్రమ్‌ ఎలా ప్రేమలో పడతాడు.. వాళ్లిద్దరూ ఎలా ఒక్కటవుతారన్న ఆసక్తి ప్రేక్షకుల్ని వెంటాడేలా సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు.

‘మనమే‘ మూవీ ఫస్టాఫ్‌లో కనిపించినంత వినోదం సెకండాఫ్ లో మిస్సైంది. ద్వితియార్థంలో కొన్ని సన్నివేశాలు కన్ఫ్యూజన్ కలుగజేస్తాయి. అయితే.. చివరిలో పేరెంట్స్ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ తో మంచి ఎండింగ్ ఇచ్చారు. పెద్దగా యాక్షన్ హంగామా లేకుండానే క్లైమాక్స్ ను ముగించాడు డైరెక్టర్.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది శర్వానంద్. ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలు, ఎమోషనల్ మూవీస్ లో మురిపించే శర్వానంద్.. ఇలా ఫుల్ లెన్త్ జాలీగా నటించిన సినిమాలు చాలా తక్కువే. ఈ మూవీలోని విక్రమ్ పాత్రలో శర్వానంద్ ఎంతో హుషారుగా కనిపించాడు. కామెడీ పంచడంతో పాటు ఎమోషనల్ సీన్స్ లో అదరగొట్టాడు. ‘ఉప్పెన‘ తర్వాత పెద్దగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పడని కృతి శెట్టికి ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది.ఖుషి పాత్రలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య నటించాడు. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇంకా.. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ వంటి వారు తమ పాత్రలతో నవ్వులు పంచగా.. అయేషా ఖాన్ గ్లామర్ రోల్ లో మురిపించింది.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసుకున్న కథ కొత్తగా ఉన్నా.. కథనంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా, కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తాయి. లండన్‌ లొకేషన్స్‌ని అద్భుతంగా చూపించారు సినిమాటోగ్రాఫర్స్ జ్ఞాన శేఖర్‌ వి.ఎస్‌., విష్ణు శర్మ. ‘ఖుషి, హాయ్ నాన్న‘ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన హేషమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమాలో అంతగా కనిపించదు. ఇక.. ఈ సినిమాను ఎంతో రిచ్ గా తీర్చిదిద్దడంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

చివరగా
‘మనమే‘.. మంచి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు.

రేటింగ్:2.75/ 5

Related Posts